ఆస్కార్ విన్నర్ జోకర్: ఉత్తమ నటుడిగా జాక్విన్‌ ఫొనిక్స్

  • Publish Date - February 10, 2020 / 04:38 AM IST

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన జోకర్ సినిమాలో నటనకుగానూ ప్రధాన పాత్ర పోషించిన జాక్విన్‌ ఫొనిక్స్‌‌కు ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న కిరాతకమైన కామిక్ క్యారెక్టర్ జోకర్. సిగరెట్ కాల్చినంత సులువుగా ప్రాణాలు తీసే ఈ పాత్ర అసలెందుకిలా మారిందో చాలామందికి తెలియదు.

అసలు ఈ జోకర్ ఎవరు? ఎందుకిలా మారాడు? ఏం సాధించాలనుకుంటున్నాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానంగా 2019లో వచ్చిన చిత్రమే ‘జోకర్’. సూపర్‌హీరో బ్యాట్‌‌మాన్ గురించి పెద్దగా ప్రస్తావించకుండా కేవలం అతని ప్రధాన శత్రువైన జోకర్ పాత్ర కేంద్రంగా తెరకెక్కింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించిన ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టుకుంది.

జోకర్ పాత్రలో జోక్విన్ ఫీనిక్స్ నటనకు అభిమానులే కాదు, అవార్డులిచ్చే న్యాయనిర్ణేతలు కూడా ఫిదా అయిపోయారు. అందుకే అతన్ని గోల్డెన్ గ్లోబ్ ఇంతకుముందు వరించగా.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు దక్కింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ‘ఆస్కార్‌’ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది.