Katragadda Murari : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మురారి తుదిశ్వాస విడిచారు. కాట్రగడ్డ మురారి యువ చిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మించారు. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, జానకి రాముడు, శ్రీనివాస కల్యాణం, సీతా మహాలక్ష్మి, గోరింటాకు సహా పలు చిత్రాలు తెలుగులో ఆయన నిర్మించారు.

Katragadda Murari : ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో మురారి తుదిశ్వాస విడిచారు. కాట్రగడ్డ మురారి యువ చిత్ర ఆర్ట్స్ పేరుతో పలు సినిమాలు నిర్మించారు. నారి నారి నడుమ మురారి, త్రిశూలం, జానకి రాముడు, శ్రీనివాస కల్యాణం, సీతా మహాలక్ష్మి, గోరింటాకు సహా పలు చిత్రాలు తెలుగులో ఆయన నిర్మించారు. కాట్రగడ్డ మురారి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1944లో విజయవాడలో పుట్టిన కాట్రగడ్డ.. సినీ రంగంలోకి వెళ్లి చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు.

చెన్నైలోని తన నివాసం ‘నీలాంగరై’లో శనివారం (అక్టోబర్ 15) రాత్రి 8.50 గంటలకు మురారి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. కాట్రగడ్డ మురారి 1944 జూన్‌ 14న విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలో కాట్ర‌గ‌డ్డ భ‌వానీశంక‌ర‌రావు, అన‌సూయ‌మ్మ దంప‌తుల‌కు మురారి జ‌న్మించారు. సినిమాలపై మక్కువతో డాక్టర్ చదువును మధ్యలోనే ఆపేసి చెన్నై వెళ్లారు. డైరెక్టర్ అవుదామనుకొని నిర్మాతగా మారారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

‘యువచిత్ర ఆర్ట్స్‌’ పేరుతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. గోరింటాకు, నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకిరాముడు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురారి నిర్మించిన జానకిరాముడు చిత్రం నాగార్జున, విజయశాంతి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. సీతామహాలక్ష్మి, శ్రీనివాస కల్యాణం, జేగంటలు ఆయన తీసిన మరికొన్ని సినిమాలు. కాట్రగడ్డ మురారి నిర్మించిన అన్ని సినిమాలకు కేవీ మహదేవన్‌ సంగీతం సమకూర్చడం విశేషం. సంగీతం పరంగాను ఆయన సినిమాలు మంచి గుర్తింపు సాధించాయి. 90వ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కాట్రగడ్డ మురారి 2012లో ‘నవ్విపోదురు గాక’ పేరుతో ఆత్మకథ రాశారు.

తెలుగు చలన చిత్ర రంగంలో దిగ్గజ దర్శకులు కె విశ్వనాథ్‌, దాసరి నారాయణ రావు, కె రాఘవేంద్రరావు, జంద్యాల వంటి వారితో కలిసి కాట్రగడ్డ మురారి పని చేశారు. అతి కొద్ది సినిమాలు నిర్మించినా.. ఇప్పటికీ అవి క్లాసికల్ సినిమాలుగానే నిలిచాయి. తెలుగు చలన చిత్ర నిర్మాతల గురించి భావి తరాలకు తెలిపేందుకు ‘తెలుగు చలన చిత్ర నిర్మాతల చరిత్ర’ అనే పుస్తకం రాయడంలో కాట్రగడ్డ మురారీ కీలక పాత్ర వహించారు.

యువ చిత్ర పతాకంపై అత్య‌ద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత కాట్ర‌గ‌డ్డ‌ మురారి మ‌ర‌ణం తెలుగు చిత్ర‌సీమ‌కు తీర‌ని లోటు. చ‌క్ర‌పాణి, దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి, మ‌హాక‌వి శ్రీశ్రీ, పాల‌గుమ్మి ప‌ద్మ‌రాజు వంటి సాహితీ ప్ర‌ముఖుల‌తో ఉన్న అనుబంధ‌మే మురారికి క‌థాబ‌లం ఉన్న చిత్రాల నిర్మాత‌గా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. చిన్న‌త‌నం నుండి సంగీతం, సాహిత్యం మీద ఉన్న మ‌క్కువే ఆయ‌న నిర్మించిన చిత్రాలు క‌ల‌కాలం ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచి ఉండ‌టానికి కార‌ణ‌మైంది. సినిమా రంగం మీద మ‌క్కువ… ఎంబీబీఎస్ విద్య‌ను చివ‌రి సంవ‌త్స‌రంలో ఆపేసి ఆయ‌న్ని చెన్నై చేర్చింది.