Kattalan Review : మలయాళం సినిమా ‘కాటాలన్’ రివ్యూ.. పుష్ప సినిమాని దించేశారుగా..

ఈ సినిమా చూస్తే మార్క్ స్టైల్ మేకింగ్, పుష్ప సినిమా లాంటి కథతో, కెజిఎఫ్ లాంటి విజువల్స్ తో తెరకెక్కించారు.(Kattalan Review)

  • Updated on- May 28, 2026 / 03:59 PM IST

Kattalan Movie Review

Kattalan Review : క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కాటాలన్’. ఆంటోని వర్గీస్ హీరోగా దుషార విజయన్, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిఖ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. కాటాలన్ సినిమా పాన్ ఇండియా వైడ్ నేడు మే 28న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

కేరళలోని ఓ అడవి పక్కనే చిన్న గ్రామం. అడవిలోని ఏనుగులు ఆ ఊరిమీద పడి మనుషులను చంపుతూ ఉంటాయి. దీంతో ఆ ఊరి ప్రజలు దగ్గర్లో ఉన్న ఓ చిన్న రౌడీ మారి(రాజ్ తిరందాసు) దగ్గరకు వెళ్లి కాపాడమంటారు. దీంతో మారి ఆ ఊరి జనాలనే వాడుకొని ఏనుగులను చంపుతూ వాటి దంతాలతో బిజినెస్ చేస్తూ ఇండియా, శ్రీలంక ఏనుగు దంతాల మాఫియాకు లీడర్ అవుతాడు. 15 ఏళ్ళ తర్వాత మారి(సునీల్) బిజినెస్ కి ఎడ్డీ(కబీర్ సింగ్ దుహాన్) అడ్డం వచ్చి పోలీసుల సహాయంతో అతనికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు.

దీంతో మారి ఎడ్డీ నుంచి తన సరుకుని కాపాడుకోవడానికి యాంటోని(ఆంటోని వర్గీస్)ని తీసుకొస్తాడు. యాంటోని సహాయంతో మారి తన బిజినెస్ ని చేయడానికి ప్రయత్నిస్తాడు. మారి కింద పనిచేసే ఊరి మనుషులు అతని ఆకృత్యాలను యాంటోనికి చెప్పి తమని కాపాడమని కోరతారు. యాంటోని మారి ఆకృత్యాలను స్వయంగా చూస్తాడు. యాంటోని మారి కోసం పనిచేస్తాడా? ఎడ్డీని మారి ఎలా ఎదుర్కొంటాడు? యాంటోని ఊరివాళ్ల కోసం మారికి ఎదురు తిరుగుతాడా? ఈ ఏనుగు దంతాల మాఫియా ఎలా నడుస్తుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Ram Charan: స్వయంగా మోదీ అడిగారు.. ‘పెద్ది’ మూవీ వికసిత్ భారత్ అని చెప్పాను: రామ్ చరణ్

సినిమా విశ్లేషణ..

ఈ సినిమాని మలయాళం హిట్ సినిమా మార్క్ మేకర్స్ చేసారని తెలియడంతో కాస్త అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా చూస్తే మార్క్ స్టైల్ మేకింగ్, పుష్ప సినిమా లాంటి కథతో, కెజిఎఫ్ లాంటి విజువల్స్ తో తెరకెక్కించారు. పుష్ప సినిమాలో ఎర్ర చందనం అడవుల్లోంచి కొట్టి దొంగతనంగా ఎలా తరలిస్తారో ఇందులో ఏనుగులను చంపి వాటి దంతాలను తరలిస్తారు. పుష్పలో విలన్స్ విలన్స్ కొట్టుకొని మధ్యలో వచ్చినోడు మాఫియా లీడర్ ఎలా అవుతాడో ఇందులో కూడా అంతే.

మొత్తం పుష్ప కథనంతోనే సినిమాని స్టైలిష్ మేకింగ్ గా నడిపించారు. కాకపోతే విలన్స్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఎక్కువగా సాగదీశారు. ఫస్ట్ హాఫ్ అంతా మారి కథతోనే సగం నడుస్తుంది. ఆ తర్వాత మారి – ఎడ్డీ గొడవలు, మధ్యలో యాంటోని వచ్చి ఏనుగు దంతాలు సరఫరాతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా యాంటోని దంతాలు ఎలా ట్రాన్స్పోర్ట్ చేసాడు? ఊరి వాళ్ళ కష్టాలు, మారి – ఎడ్డీలతో యాంటోని శత్రుత్వంతో సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ సింపుల్ గానే సాగినా సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ తో బాగానే సాగింది. ఇక ఐటెం సాంగ్ ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఈ సినిమాలో శ్రీలంకకు ఏనుగు దంతాలు తీసుకెళ్లే ఓ సీన్ పుష్పలో ఎర్రచందనం శ్రీలంకకు సముద్రంలోంచి తీసుకెళ్లే సీన్ ని గుర్తుచేస్తుంది. డైరెక్టర్ పుష్ప సినిమాని చూసి బాగా ఇన్ స్పైర్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఇక కాటాలన్ అనే తెలుగులో వేటగాడు అని అర్ధం. సినిమాలో అందరూ ఏనుగుల్ని వేటాడే వాళ్ళే. రెగ్యులర్ యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు చూడొచ్చు. ఈ సినిమాకు పార్ట్ 2 లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

యువ మారి పాత్రలో తెలుగు నటుడు రాజ్ తిరందాసు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సీనియర్ మారి పాత్రలో సునీల్ విలన్ గా ఒదిగిపోయాడు. ఎడ్డీ పాత్రలో కబీర్ సింగ్ పర్వాలేదనిపించారు. హీరోగా ఆంటోనీ వర్గీస్ బాగానే నటించి మెప్పించాడు. హీరోయిన్ దూశారా విజయన్ గెస్ట్ పాత్రలో అదరగొట్టింది. మలయాళ నటులు జగదీశ్, సిద్ధికి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Massa Massa Song: మోస్ట్ అవైటెడ్.. పెద్ది ‘మస్సా.. మస్సా’ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ వినేయండి

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ హెవీగా ఉంది. అక్కర్లేని ఎలివేషన్స్ కోసం RR హెవీగా ఇచ్చారు. ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్, స్లో మోషన్ ఎలివేషన్ సీన్స్ కట్ చేయొచ్చు. ఇటీవల వస్తున్న పలు కమర్షియల్ సినిమాలు చూసి దర్శకుడు ఈ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. సాంకేతికంగా మాత్రం బాగానే తెరకెక్కించారు. తెలుగు డబ్బింగ్ చాలా చోట్ల సరిగ్గా కుదరలేదు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘కాటాలన్’ సినిమా ఏనుగు దంతాల మాఫియా కథతో తెరకెక్కించిన రెగ్యులర్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.