Youth Movie Review : ‘యూత్ ‘ మూవీ రివ్యూ.. జెన్ జీ యూత్ ఈ సినిమా చూడాల్సిందే..
కెన్ కరుణాస్, అనీషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యూత్’(Youth Movie Review ).
- Thota Vamshi Kumar
- Published On : March 27, 2026 / 01:38 PM IST
Ken Karunaas Youth Movie Review and Rating
Youth Movie Review: కెన్ కరుణాస్, అనీషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యూత్’. కరుప్పయ్య సి రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ఈ2సి టాకీస్ మార్చి 26న రిలీజ్ చేసింది. ఈ సినిమా కెన్ అండ్ గ్యాంగ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కింది.
కథ విషయానికొస్తే..
ప్రవీణ్(కెన్) చదువులో అంతంత మాత్రమే. కానీ ప్రవీణ్‌కి అతని అమ్మ సరోజ (దేవదర్శిని) ప్రతీ విషయంలో సపోర్ట్ చేస్తుంటుంది. బేకరి నడుపుతూ మిడిల్ క్లాస్ జీవితాన్ని సాగించే తండ్రి ఉన్ని కృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) మాత్రం తన కొడుకు ప్రవీణ్‌ని చదువు విషయంలో ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటాడు. బార్డర్ మార్కులతో టెన్త్ పాస్ అయిన ప్రవీణ్ ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. అమ్మాయిలు తనని చూడరు అని, ఎవ్వరూ తనని ప్రేమించరు అని ప్రవీణ్ అనుకుంటూ ఉంటాడు.
Samyuktha : పలుచని చీరలో హీరోయిన్ సంయుక్త .. ఫొటోలు వైరల్..
అలాంటి ప్రవీణ్ జీవితంలోకి ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాలి (ప్రియాన్షీ యాదవ్), గంగవల్లి (అనీషా అనిల్ కుమార్) వస్తారు. వాళ్ళ రాకతో ఏం జరుగుతుంది? తల్లిదండ్రుల ఆశల్ని నిలబెట్టేలా ప్రవీణ్ చదువుతాడా? లేదా? అమ్మాయిలు, ప్రేమ అంటూ చదువుని నిర్లక్ష్యం చేస్తాడా? చివరకు ప్రవీణ్ కి ఆ ముగ్గురు అమ్మాయిలకు మధ్య ఏం జరిగింది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
యూత్‌కి నచ్చేలా కాలేజ్, ప్రేమ, కామెడీ సన్నివేశాలని అల్లుకుని కాస్త కథను టచ్ చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. సరిగ్గా కెన్ అండ్ గ్యాంగ్ చేసింది కూడా ఇదే. ఇలాంటి కథలు బోలెడన్ని సినిమాలు వచ్చి ఉంటాయి. అయితే ఈ యూత్‌లోనూ చాలా వరకు కొత్తదనం కనిపించక పోవచ్చు. కానీ ఎక్కడా బోరింగ్‌గా మాత్రం అనిపించదు. ఎంటర్టైనింగ్‌గా తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. యూత్ మూవీ యూత్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే నటుడిగా కెన్ పలు సినిమాలతో మెప్పించాడు. తెలుగులో ధనుష్ సార్ సినిమాలో తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు హీరోగా నటిస్తూ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో తెరకెక్కించాడు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా తల్లిదండ్రులు, కొడుకు మధ్య సన్నివేశాలు, కాలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, అక్కడ అమ్మాయిలు, ప్రేమ అంటూ తిరిగే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కాలేజ్‌లో వచ్చే కామెడీ సీన్స్, లవ్ ట్రాక్ ఇది వరకు చూసినట్టే అనిపించినా కెన్ అండ్ గ్యాంగ్ చేసిన యాక్టింగ్‌తో కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అది అసలు ప్రేమేనా? ఆకర్షణా? అన్న అనుమానం చూసే ఆడియెన్స్‌కి కూడా కలుగుతుంది. ఇక ఇంటర్వెల్‌కి వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ ముందే తెలిసిపోతుందనిపిస్తుంది. అయినా కూడా అక్కడి సీన్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
సెకండ్ హాఫ్‌లో అల్లరి చిల్లరగా తిరిగే హీరో ప్రవర్తన, ప్రేమించే విషయంలో కాస్త తేడా కనిపిస్తుంది. అసలైన ప్రేమను గురించి ప్రవీణ్ తెలుసుకునే సీన్స్, అమ్మానాన్నల ఎమోషనల్ ట్రాక్, ప్రీ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టించే సీన్లు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఇక క్లైమాక్స్‌లోనూ మంచి ఎండింగ్‌ను ఇచ్చారు. చదువుకి ఉండే గొప్పదనం, చదువుకున్న వారికి ఈ సొసైటీ ఇచ్చే గౌరవం గురించి తండ్రి చెప్పే మాటలు, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ని కదిలిస్తాయి. ఓ మంచి సినిమాని చూశామన్న ఫీలింగ్‌తో ఆడియెన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇప్పటి జెన్ జీ యూత్ కచ్చితంగా చూడాల్సిన సినిమా.
నటీనటుల పర్ఫార్మెన్స్..
తండ్రి తమిళ సీనియర్ నటుడు కరుణాస్ ప్రేరణతో నటుడు అయిన కెన్ ఇప్పటికే నటుడిగా పలు సినిమాలతో మెప్పించగా ఇప్పుడు హీరోగా యూత్ సినిమాతో చాలా యాక్టివ్ గా నటించి అదరగొట్టాడు. గంగవల్లిగా అనీషా, ప్రేషిక పాత్రలో మీనాక్షి, సోనాల్ కారెక్టర్‌లో ప్రియాన్షీ క్యూట్ గా కనిపిస్తూ బాగానే నటించారు. కెన్ అండ్ గ్యాంగ్ కూడా ప్రతీ సీన్‌లో నవ్వించారు. కెన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు అక్కడక్కడా నవ్విస్తూ ఆకట్టుకుంటారు. మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా సూరజ్, దేవదర్శిని చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వలేదనిపించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. జీవీ ప్రకాష్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ లవ్ స్టోరీ అయినా యూత్‌కి నచ్చే అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
Niharika Konidela : దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా.. మెగా డాటర్ నిహారిక క్యూట్ ఫోటోలు..
మొత్తంగా ‘యూత్’ ఓ అల్లరిచిల్లరగా తిరిగే ఓ కుర్రాడు చివరకు ఎలా మారాడు? ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది చక్కగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక: ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..
