కరోనా రిలీఫ్‌కు రూ. 3 కోట్లు.. ‘చంద్రముఖి 2’ అడ్వాన్స్ అలా పంచేశాడు..

కరోనా రిలీఫ్‌కు భారీ విరాళం ప్రకటించిన రాఘవ లారెన్స్..

  • Publish Date - April 9, 2020 / 04:04 PM IST

కరోనా రిలీఫ్‌కు భారీ విరాళం ప్రకటించిన రాఘవ లారెన్స్..

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన గత 15 ఏళ్లుగా లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పేదలు, వికలాంగులకు విద్య, వసతి, ఆరోగ్యం వంటి సదుపాయలు కల్పిస్తుంటారు లారెన్స్. ప్పటికే ఎందరికో గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్ ఏ విపత్తు వచ్చినా ముందుండి అధిక మొత్తం విరాళాలు ఇస్తుంటాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కూడా లారెన్స్ భారీ విరాళం ప్రకటించారు. తదుపరి తను చేయబోయే చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ అందగానే రూ. 3 కోట్లను విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా లారెన్స్ ప్రకటించారు.

‘‘నా స్నేహితులు, అభిమానులతో నేనొక సంతోషకరమైన వార్తను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా తలైవర్ రజినీకాంత్ తదుపరి చిత్రం ‘చంద్రముఖి2’లో నటించబోతున్నాను. రజినీకాంత్‌గారి అనుమతి, ఆశీస్సులతో ఈ చిత్రంలో నటించబోతున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీలవుతున్నాను. పి. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని నేను ఎంతో ఇష్టపడే సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌గారు నిర్మిస్తున్నారు. నేను ఆ చిత్రం నుంచి పొందే అడ్వాన్స్‌తో, కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా 3 కోట్లు విరాళంగా ఇస్తానని వినయంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

Read Also : బన్నీ ఆలోచన గొప్పది.. ప్రశంసలు కురిపించిన కేరళ సీఎం విజయన్..

అందులో రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు ఫిల్మ్ ఎంప్లాస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు (FEFSI), అలాగే డ్యాన్సర్స్ యూనియన్‌కు నా తరుపు నుంచి రూ. 50 లక్షలు, నా దగ్గర ఉన్న దివ్యాంగులకు రూ. 25 లక్షలు మరియు నేను పుట్టిన రోయపురం-దేశీయనగర్‌లోని రోజూ పని చేస్తేనే కానీ పూట గడవని కార్మికులకు రూ. 75 లక్షలు విరాళంగా ఇవ్వనున్నాను. నేను అందించే ఆహార, నిత్యావసర వస్తువులన్నీ పోలీసుల సహాయంతో సురక్షితంగా అందజేయడం జరుగుతుంది. సేవే దైవం..’’ అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో ట్రాన్స్ జెండర్స్ వసతికోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు లారెన్స్.