Susheela Tribute to SP Balu: కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదని, వెంటాడి.. వెంటాడి అందరికి కావాల్సిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంను తీసుకుపోయిందని గానకోకిల పి.సుశీల అన్నారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె.
బాలు మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. దేశ, విదేశాల్లో ఎస్పీకి మంచి పేరు ఉందన్నారు. బాలు సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఘంటసాలనే మెప్పించారని.. మంచి పాటలు పాడి ఆయనను మరిపించారని సుశీల అన్నారు.
బాలుతో అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశామని సుశీల తెలిపారు. దాదాపు 55 ఏళ్ల పాటు ఇద్దరం కలిసి వేల పాటలు పాడామన్నారు. బాలుని మరచిపోవాలంటే చాలా కష్టమని, అలాంటి వ్యక్తి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు సుశీలమ్మ.