డిస్ట్రిబ్యూటర్‌గా మారి ‘సరిలేరు నీకెవ్వరు’ గుంటూరు రైట్స్ దక్కించుకున్న డైరెక్టర్ మెహర్ రమేష్ జాక్‌పాట్ కొట్టేశాడు..
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిచింది. అన్ని చోట్ల నుండి భారీ వసూళ్లు రాబడుతుందీ చిత్రం. ఈ సినిమాతో డైరెక్టర్ మెహర్ రమేష్ డిస్ట్రిబ్యూటర్‌గా మారడం విశేషం. మెహర్ రమేష్ కన్నడలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగులో ‘దేశముదురు’, ‘పోకిరి’ వంటి సినిమాలకు రచనా విభాగంలో పనిచేశాడు. దర్శకుడిగా మారి ప్రభాస్‌తో ‘బిల్లా’ రీమేక్ చేశాడు. ఆ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత చేసిన ‘కంత్రీ’, ‘శక్తి’, ‘షాడో’ సినిమాలు ఒకదాన్ని మించి మరోటి ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. మనోడి పేరు చెబితే హీరోలు ఆమడ దూరం పారిపోయేవారు. దాంతో మెహర్ దాదాపు కనుమరుగైపోయాడు. మనోడికి ఊహించని విధంగా మహేష్ బాబు టీమ్‌లో ప్లేస్ దక్కింది. గతకొద్ది కాలంగా మహేష్‌తో యాడ్స్ చేస్తూ, ఆ ఫ్యామిలీలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
మెహర్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలనుకుని అతనికి ‘సరిలేరు నీకెవ్వరు’ గుంటూరు రైట్స్ ఇప్పించాడు మహేష్. అక్కడ కేవలం అడ్వాన్సుల రూపంలోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట. సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడం.. పైగా రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతుండడంతో మనోడికి భారీ స్థాయిలో లాభాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలవారు. మొత్తానికి మహేష్ పుణ్యమా అని డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఫస్ట్ సినిమాతోనే జాక్‌పాట్ కొట్టిన మెహర్ రమేష్ ఇక ముందు పంపిణీ దారుడిగానే కంటిన్యూ అవుతాడా లేక మళ్లీ దర్శకత్వం వైపు దూకుతాడా అనేది చూడాలి మరి.