Blakrishna Receiving PPE Kits& Masks: కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే భాద్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే వ్యాక్సిన్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం ఉదయం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు మహేశ్వర మెడికల్ కాలేజి మరియు హాస్పిటల్, సంగారెడ్డి వారు కోవిడ్ రక్షణ కవచాలైన పీపీఈ కిట్స్ మరియు ఎన్95 మాస్క్ లు అందజేశారు. వీటిని హాస్పిటల్ తరపున బాలకృష్ణ స్వయంగా టీజీఎస్ మహేష్ (ఛైర్మన్, మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ సంగారెడ్డి) చేతుల మీదుగా స్వీకరించారు. మొత్తం 1000 పీపీఈ కిట్లు, 1000 ఎన్95 మాస్క్ లను ఈ సందర్భంగా మహేశ్వర మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ వారు హాస్పిటల్ సిబ్బందికి అందజేశారు.
కార్యక్రమ అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ సినిమా షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతి ఇప్పుడే వచ్చిందని, త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలందరం కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.