×
Ad

Mass Jathara Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ.. రైల్వే పోలీస్ గా రవితేజ ఏం చేసాడు?

ఇది రవితేజకు 75వ సినిమా కావడం గమనార్హం. (Mass Jathara)

Mass Jathara Review

Mass Jathara Review : రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇది రవితేజకు 75వ సినిమా కావడం గమనార్హం. నవీన్ చంద్ర, నరేష్, రాజేంద్ర ప్రసాద్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మాస్ జాతర సినిమా రేపు నవంబర్ 1న రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. లక్ష్మణ్ భేరి(రవితేజ) వరంగల్ లో సిన్సియర్ రైల్వే పోలీస్. అతని తాత(రాజేంద్రప్రసాద్) తో కలిసి ఉంటాడు. తాత లక్ష్మణ్ కి వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొడుతూ ఉంటాడు. ఓ మినిస్టర్ తో గొడవ కారణంగా లక్ష్మణ్ కి శ్రీకాకుళంలోని అడవి వరం అనే ఓ గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ శివుడు(నవీన్ చంద్ర) రైతులతో గంజాయి పండించి అమ్ముతూ ఉంటాడు. ఆ ఊళ్ళో జరుగుతున్న అక్రమాలని లక్ష్మణ్ సహించలేడు. కానీ అతను రైల్వే పోలీస్ అవ్వడంతో అతని పరిధి రైల్వే స్టేషన్ వరకే ఉండటంతో ఏం చేయలేకపోతాడు.

రైల్వే స్టేషన్ లో రోజూ ప్రయాణం చేసే తులసి(శ్రీలీల)తో పరిచయం అయి ప్రేమలో పడతాడు. శివుడి గంజాయి సరుకు అనుకోకుండా ఓ గూడ్స్ ట్రైన్ లో తన స్టేషన్ కి రావడంతో శివుడి మనుషులని కొట్టి ఆ సరుకు అంతా దాచేస్తాడు. లక్ష్మణ్ గంజాయి ఎక్కడ దాచాడు? అసలు ఎందుకు దాచాడు? శివుడు తన సరుకుని కనుక్కుంటాడా? లక్ష్మణ్ అసలు రైల్వే పోలీస్ ఎందుకయ్యాడు? అతన్ని అంత చిన్న ఊరికి ఎవరు ట్రాన్స్‌ఫర్ చేసారు? తులసితో ప్రేమాయణం ఏమైంది? శివుడు – లక్ష్మణ్ మధ్య విబేధాలు ఏమయ్యాయి.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Baahubali The Epic Review : ‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రివ్యూ.. రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా ఎలా ఉందంటే..? ఏమేం సీన్స్ కట్ చేసారు? జత చేసారు?

సినిమా విశ్లేషణ..

రవితేజ 75 వ సినిమా కావడం, కామెడీ రచయితగా ఫేమ్ తెచ్చుకున్న భాను దర్శకుడిగా మారడం, ధమాకా తర్వాత రవితేజ – శ్రీలీల – భీమ్స్ కాంబో కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ముందు నుంచి ఇది పక్కా కమర్షియల్ సినిమా అనే చెప్తూ వచ్చారు. హీరో ఎంట్రీ సాంగ్, హీరోయిన్ పరిచయం ప్రేమ, విలన్ ఎంట్రీ, విలన్ మనుషులతో హీరో ఫైట్స్, మధ్యలో సాంగ్స్.. ఇలా సాగే కమర్షియల్ సినిమాలాగే ఉంటుంది మాస్ జాతర.

సినిమా అంతా గంజాయి బ్యాక్ డ్రాప్, ఒక గంజాయి సరుకు పట్టుకోవడం చుట్టే తిరుగుతుంది. అక్కడక్కడా ఘాటీ సినిమా గుర్తుకు వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే శ్రీలీల ట్విస్ట్ బాగుంటుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసుకున్నారు. రవితేజ, శ్రీలీల లవ్ ట్రాక్ బాగానే ఉంటుంది. అజయ్ ఘోష్, హైపర్ ఆది, రాజేంద్ర ప్రసాద్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. రైతులు గంజాయి ఎందుకు పండిస్తున్నారు అనే పాయింట్ ని ఇంకా బలంగా చూపించే అవకాశం ఉన్నా ఆ పాయింట్ ని చెప్పకుండా హీరో – విలన్ పట్టుబడ్డ సరుకు, మధ్యలో హీరోయిన్ తోనే కథనం అంతా నడిపించారు.

రవితేజ ఎనర్జీ, ఇడియట్ , నా ఆటోగ్రాఫ్ మెమరీ రిఫరెన్స్ లు మాత్రం ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. రవితేజకి రాజేంద్రప్రసాద్ తాతగా, సముద్రఖని మామగా చేసిన పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. హీరో తెలంగాణ యాస, హీరోయిన్ శ్రీకాకుళం యాసతో కొత్త కాంబో చూసినట్టు ఉంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..

రవితేజ మాత్రం ఎప్పట్లాగే ఫుల్ ఎనర్జీతో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో అదరగొట్టాడు. శ్రీలీల రెండు వేరియేషన్స్ లో బాగా నటించింది. ఇక తన హావభావాలు, డ్యాన్స్ తో అదరగొట్టేసింది. నెగిటివ్ విలన్ గా శివుడి పాత్రలో నవీన్ చంద్ర అదరగొట్టాడని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్ తాత పాత్రలో అక్కడక్కడా నవ్వించి చివర్లో చిన్న సర్ ప్రైజ్ ఇవ్వడం గమనార్హం. సీరియల్ యాక్టర్ నవ్యస్వామికి ఒక్క డైలాగ్ కూడా లేని ఓ చిన్న పాత్ర ఇచ్చారు. అజయ్ ఘోష్, హైపర్ ఆది, వీటివి గణేష్ మాత్రం అక్కడక్కడా బాగానే నవ్వించే ప్రయత్నం చేసారు. తారక్ పొన్నప్ప, సముద్రఖని, మురళి శర్మ, నరేష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Tejeswini Nandamuri : ఇన్నాళ్లు తెరవెనుక.. ఫస్ట్ టైం తెరపై బాలయ్య కూతురు.. నందమూరి తేజస్విని నటించిన యాడ్ చూశారా?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఇక తు మేరీ లవర్ సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ అన్ని యావరేజ్. ఎడిటింగ్ లో ఓ సాంగ్, కొంత సీన్స్ కట్ చేసే స్కోప్ ఉంది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం కొత్తగా బాగా డిజైన్ చేసారు. రెగ్యులర్ కథ, కథాంశంతో మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ మెచ్చేలా పక్కా కమర్షియల్ గా సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘మాస్ జాతర’ ఓ రైల్వే పోలీస్ ఆఫీసర్ ఏం చేసాడు అని సాగే కమర్షియల్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.