Ram Charan Birthday : ‘రామ్ చరణ్’ బర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ కొడుకు నుంచి గ్లోబల్ స్టార్‌గా ‘చిరుత’ ప్రయాణం..

మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగాడు రామ్ చరణ్.

Mega Power Star to Global Star Ram Charan Birthday Special

Ram Charan Birthday : ప్రస్తుతం రామ్ చరణ్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అందరికి తెలుసు. RRRతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘చిరుత’తో మొదలైన ప్రయాణం RRR వరకు తండ్రి మెగాస్టార్ అయినా అంత ఈజీగా జరగలేదు. ఫ్లాప్స్ చూశాడు, విమర్శలు ఎదుర్కున్నాడు, నటన రాదు అన్నారు, హావభావాలు పలికించలేదు అన్నారు.. కానీ అవన్నీ దాటుకొని నేడు హాలీవుడ్ లో కూడా తన గురించి మాట్లాడుకునేలా చేసాడు చరణ్. ఇదంతా జరగడానికి దాదాపు 15 ఏళ్లపైనే పట్టింది.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంటే తెలుగు పరిశ్రమలో శిఖరం. కోట్లాది మంది అభిమానులు, లెక్కలేనన్ని విజయాలు, తెలుగు సినీ పరిశ్రమని మూడు దశాబ్దాలు ఏలిన హీరో.. అలాంటి నటుడి కొడుకు హీరోగా వస్తున్నాడంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. చరణ్ పై అన్ని అంచనాలు ఉన్నాయి మొదటి సినిమాకి. అందులోను మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా లాంచ్ అవుతుండటంతో చరణ్ మొదటి సినిమా చిరుతపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నిటిని చరణ్ నిలబెట్టాడు. మెగాస్టార్ కి తగ్గట్టు ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమాతో వచ్చి ఫైట్స్, డ్యాన్స్ లతో కుమ్మేసాడు.

ఇక రెండో సినిమాకే మగధీర అంటూ ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టేసాడు. ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింత పండగ చేసుకున్నారు. దీంతో చరణ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. తండ్రిని మించిన హీరో అవుతాడని అంతా భావించారు. కానీ మూడో సినిమా ఆరెంజ్ దారుణమైన పరాజయం చూసింది. సినిమా సాంగ్స్ పెద్ద హిట్ అయినా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రచ్చ, నాయక్ కమర్షియల్ గా ఓకే అనిపించాయి. ఆ తర్వాత హిందీ – తెలుగు బైలింగ్వల్ జంజీర్ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎవడు యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ కూడా యావరేజ్ గానే నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చారు.

Also Read : Ram Charan : కొడుకు బర్త్‌డే సందర్భంగా.. 500 మందికి అన్నదానం చేసిన రామ్‌చరణ్ తల్లి..

అయితే రచ్చ సినిమా నుంచి బ్రూస్లీ వరకు అన్ని సినిమాలు(మధ్యలో గోవిందుడు అందరివాడేలే తప్ప) ఒకే మూసలో ఉన్నాయి అని, చరణ్ కి అసలు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం రావట్లేదని విమర్శలు చేసారు. ఏదో కమర్షియల్ హీరోగా చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ నటన చూపించట్లేదని, తండ్రి పేరు నిలబెట్టట్లేదని విమర్శలు వచ్చాయి. వాటన్నిటిని విని చరణ్ తనని తాను మార్చుకున్నాడు. ఆ తర్వాత ధ్రువ సినిమాతో తన నటనలో కొంచెం వేరియేషన్ తీసుకురావడమే కాక, బాడీలో మంచి ఫిట్నెస్ తెచ్చుకొని చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు.

ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమా అయితే చరణ్ కెరీర్ లో అప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాక నటనలో తండ్రి పేరుని నిలబెట్టడని విమర్శించిన వాళ్ళే పొగిడేలా చేసాడు. కొంచెం చెవుడు ఉన్న ఓ పల్లెటూరు వ్యక్తిలా చరణ్ నటనతో అందర్నీ మెప్పించి, రంగస్థలం సినిమాలో తన నటనతో ఏడిపించాడు కూడా. ఆ సినిమా చరణ్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. మెగాస్టార్ కూడా స్టేజిపై అందరిముందు రంగస్థలం గురించి, అందులో చరణ్ నటన గురించి గర్వంగా పొగిడాడు. అయితే రంగస్థలం తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా మాత్రం నిరాశపరిచింది.

ఇక RRR సినిమా ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో అందరం చూసాం. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి పాత్రలో ఓ పక్క నటనతో, మరో పక్క తన బాడీతో అదరగొట్టేసాడు. RRR సినిమాలో ప్రతి సీన్ లోను ప్రేక్షకులని మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో ఒక సీన్ లో అందరికి రాముడు గుర్తొచ్చేలా చేసాడు చరణ్. RRR సినిమాతో నార్త్ ఇండియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. జంజీర్ బాలీవుడ్ లో ఫ్లాప్ అయినప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఇప్పుడు చరణ్ తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. RRR సినిమాతో ఆస్కార్ స్టేజి వరకు వెళ్లారు. బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎన్టీఆర్ తో కలిసి నాటు నాటు అంటూ ప్రపంచాన్ని ఊపేసాడు చరణ్. మొత్తంగా చిరుత నుంచి ప్రపంచవేదిక వరకు రామ్ చరణ్ ప్రయాణం కష్టసుఖాలతోనే సాగింది.

Also Read : Ram Charan : పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోబోతున్న రామ్‌చరణ్.. ఫ్యామిలీతో తిరుపతికి..

ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16, సుకుమార్ దర్శకత్వంలో RC17 ఉన్నాయి. ఈ మూడు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడిగానే కాక నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు తన ఫ్రెండ్స్ తో కలిసి మెగా V సెల్యులాయిడ్ నిర్మాణ సంస్థల్ని స్థాపించి సినిమాలని నిర్మిస్తున్నాడు.

ఇక మరోవైపు వ్యాపారవేత్తగా కూడా పలు రంగాలలో బిజినెస్ లు చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఫ్యామిలీకి ఎంతో ప్రియారిటి ఇస్తూ ఫ్యామిలీకి సమయాన్ని ఇస్తాడు. గతేడాదే తండ్రి కూడా అయ్యాడు. ఎక్కువగా అయ్యప్ప మాలలో కనిపిస్తూ, రెగ్యులర్ గా పూజలు చేస్తూ మన సనాతన ధర్మాన్ని చాటుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటాడు. ఒకప్పుడు మెగాస్టార్ కొడుకు అని చెప్పేవాళ్లు కానీ ఇటీవల అయోధ్యలో ఓ సంఘటన జరిగింది. చిరంజీవిని చూపిస్తూ అతను రామ్ చరణ్ తండ్రి అని కెమెరా వెనుక మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది. సినిమాలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని హీరోగా ప్రయాణం సాగిస్తూ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజుని అభిమానులు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. అన్నదానాలు, రక్తదానాలు, పలు సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తో హంగామా చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు