Megastar Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ మళ్ళీ అసలు సిసలు మెగాస్టార్‌ని చూపిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చూడని రికార్డులు, రివార్డులు, స్టార్ డమ్ లేవు. దాదాపు 25 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి.

Megastar Chiranjeevi Birthday Special Story

Megastar Chiranjeevi Birthday Special : స్టార్.. స్టార్.. మెగాస్టార్.. చిరంజీవి సినిమా అంటే ఆ రోజు పండగే.. థియేటర్లో క్యూ లైన్లో నిల్చొని చొక్కాలు చించుకొని మరీ టికెట్లు సాధించి.. థియేటర్ లోపల తెరపై చిరంజీవి కనిపిస్తే పేపర్లు, పూలు ఎగరేసి సంతోషపడే కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే త్వ‌ర‌గా కొంతమంది గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో మా అన్నయ్య అంటూ ముందుకొస్తారు.

ఒకప్పుడు ఎన్నో సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి, తన డ్యాన్సులతో థియేటర్లను దద్దరిల్లేలా చేసి, తన ఫైట్స్ తో విజిల్స్ వేయించి, సినిమా థియేటర్స్ లో జాతర వాతావరణాన్ని సృష్టించిన హీరో చిరంజీవి. కమర్షియల్ సినిమాలతో థియేటర్లకు ఊపు తెచ్చిన హీరో, ఇండియన్ తెరపై బ్రేక్ డ్యాన్స్ లతో కుర్రాళ్లను ఊగిసలాడించిన హీరో, చిన్నా పెద్దా లేకుండా అందర్నీ సినిమాలో మునిగేలా చేసిన సినీ హీరో, అసలు సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనే ఆలోచన అప్పటి కుర్రాళ్లలో కలిగించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.

Also Read : Indra – Chiranjeevi : ‘ఇంద్ర’ రీ రిలీజ్‌కు మెగాస్టార్ ప్రమోషన్స్.. ఇంద్రసేనా రెడ్డి అంటూ..

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చూడని రికార్డులు, రివార్డులు, స్టార్ డమ్ లేవు. దాదాపు 25 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన ఏకైక హీరో చిరంజీవి. చిరంజీవి తమ ఊరికి వస్తున్నాడంటే ఊరంతా జనసంద్రమయ్యేది. అలాంటి గొప్ప స్టార్ రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చారు. కానీ అప్పటికే సినిమా, సినిమా చూసే విధానం, సినిమా చూపించే విధానం మారిపోయింది. తనకున్న సినీ పరిజ్ఞానంతో, అనుభవంతో కమర్షియల్ సినిమాలు అంటూ ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు తీసుకొచ్చారు. వీటిల్లో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని పరాజయం పాలయ్యాయి.

గతంలో ఎన్నో హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా చూసారు మెగాస్టార్. కానీ ఈ సారి ఆ ఫ్లాప్స్ తో పాటు కొత్తగా సోషల్ మీడియాలో నెగిటివిటీని చూసారు. ఆయన ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు ఆయన్ని చూసి కేరింతలు కొట్టిన పిల్లలు ఇప్పుడు బాధ్యతల్లో మునిగిపోయారు. వాళ్ళకి మెగాస్టార్ ఎలా ఉన్నా నచ్చేస్తాడు. కానీ ఈ జనరేషన్ ఇంకా అసలు సిసలు మెగాస్టార్ ని చూడలేదు. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒక్కటే పెద్ద హిట్ గా నిలిచి చిరంజీవి కమర్షియల్ స్టామినాని, ఆయనలోని అప్పటి నటుడ్ని చూపించగలిగింది. అయినా అయన అభిమానుల దాహం తీరలేదు, ఇప్పటి జనరేషన్ లో చాలా మందికి ఆయన గొప్పతనం తెలియలేదు.

అసలు మెగాస్టార్ అనే పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెరపై ఆయన్ని చూస్తే ఒక ఆనందం వస్తుంది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో 70 mm తెరపై చిరంజీవిని చూసి అల్లరి చేసే అభిమానం ఇప్పుడు చాలావరకు కనుమరుగైపోయింది. ఇప్పుడు మారిన థియేటర్ వ్యవస్థ కావొచ్చు, సైలెంట్ మల్టిప్లెక్స్ లు కావొచ్చు, పెరిగిన టికెట్ రేట్లు కావొచ్చు, ఇంట్లో ఓటీటీలో చూసుకోవచ్చనే ధీమా కావొచ్చు.. ఇలాంటి చాలా పరిస్థితులు చిరంజీవిని ఈ జనరేషన్ కి దూరం చేసాయి అని చెప్పొచ్చు. కానీ చిరంజీవిలో మెగాస్టార్ అనే వేడి ఏ మాత్రం తగ్గలేదు అని రీ ఎంట్రీ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన స్వాగ్, వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయన స్టైల్ చూసి చెప్పొచ్చు.

అసలు కమర్షియల్ సినిమా ఫార్మేట్ కనిపెట్టిన హీరో ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో ఇమడలేకపోతున్నాడు అనే కామెంట్స్ ని ఆపడానికి మెగాస్టార్ కి కావాల్సింది ఒక్క సినిమా. మెగాస్టార్ అని వినిపిస్తే వచ్చే వైబ్ ఇప్పుడున్న జనరేషన్ కి, మల్టిప్లెక్స్ లకు కూడా వినపడేలా ఒక్క సినిమా చిరంజీవి నుంచి ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. వాల్తేరు వీరయ్యని మించిన స్టైల్, స్వాగ్, కథ, కమర్షియల్ అంశాలు ఉండే సినిమా ఒక్కటి మెగాస్టార్ నుంచి రావాలని కోరుకుంటున్నారు. థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల రికార్డులు ఎన్నో కొల్లగొట్టిన మెగాస్టార్ ఇప్పుడు వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్పుకునే పాన్ ఇండియా రికార్డులు కొల్లగొట్టాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

రాబోయే విశ్వంభర సినిమా కావొచ్చు, ఆ తర్వాత వచ్చే సినిమాలు కావొచ్చు ఏవైనా సరే మెగాస్టార్ అనే పిలుపుకి వచ్చే ఊపుని తెప్పిస్తాయని, థియేటర్స్ మెగాస్టార్ నామజపంతో ఊగిపోతాయని అభిమానులు ఇంకా ఆశతో ఉన్నారు. 68 ఏళ్ళ వయసులో ఆయనకు సినిమాలు చేయాల్సిన అవసరం ఇంకా లేకపోయినా కేవలం అభిమానుల కోసం, సినిమా మీద ప్రేమ కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి సినిమాలు వచ్చినా చిరంజీవి అభిమానులు ఆదరిస్తారు.

కానీ మెగాస్టార్ అనే పేరుకి తగ్గ సినిమా, దానికి తగ్గ రికార్డులు రావాలని పాత జనాలు మర్చిపోయిన మెగాస్టార్ ని, ఇప్పటి పిల్లలు చూడని మెగాస్టార్ ని మళ్ళీ థియేటర్స్ లో పరిచయం చేయాలని, చిరంజీవి సినిమా వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం రావాలని, మెగాస్టార్ సినిమా అంటే ఒక పండగ అని, థియేటర్స్ లో సినిమా దద్దరిల్లాలని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలని, సినిమా గురించి ఏళ్ళ తరబడి మాట్లాడుకోవాలని, అసలు సిసలు మెగాస్టార్ ని మన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ చూపించాలని.. అలాంటి ఒక్క సినిమా కోసం మెగాస్టార్ అభిమానులంతా కోరుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు