Mirai Review : ‘మిరాయ్’ మూవీ రివ్యూ.. మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌తో తేజ స‌జ్జా

అశోకుడి దగ్గర మొదలైన కథ త్రేతాయుగానికి లింక్ చేస్తూ సరికొత్తగా మిరాయ్ సినిమా (Mirai Review)

Mirai Review

Mirai Review : తేజ స‌జ్జా, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన సినిమా ‘మిరాయ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కించారు. మంచు మ‌నోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం.. లాంటి చాలా మంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిరాయ్ సినిమా నేడు సెప్టెంబర్ 12న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.(Mirai Review)

కథ విషయానికొస్తే.. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆ రక్తపాతం చూసి మారిన చరిత్ర మనం చదువుకున్నాం. అక్కడనుంచే కథ మొదలవుతుంది. ఆ యుద్ధం తర్వాత తన దగ్గరున్న శక్తులు వద్దనుకుని వాటిని 9 గ్రంధాల్లో భద్రపరిచి ప్రపంచం నలుమూలలా ఉన్న 9 మంది యోధులకు అప్పగిస్తాడు. ఆ గ్రంధాలను జాగ్రత్తగా భద్రపరచాలి అని చెప్తాడు. కాలక్రమేణా ఆ యోధుల వారసులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ 9 గ్రంధాలను కాపాడుతూ ఉంటారు.

2000 సంవత్సరంలో 9వ గ్రంధాన్ని కాపాడే అంబికా(శ్రియా)కు భవిష్యత్తు కనపడటంతో మిగిలిన గ్రంధాలు కాపాడే వాళ్ళని పిలిచి జాగ్రత్త చెప్తుంది. ఈ గ్రంధాలను, ప్రపంచాన్ని కాపాడటానికి అంబికా అగస్త్యముని(జయరాం) ఆదేశాలతో తన కడుపులో ఉన్న కొడుకుని పుట్టగానే వదిలేసి కనపడకుండా పోతుంది. 24 ఏళ్ళ తర్వాత అప్పటికే మహావీర్ లామా(మంచు మనోజ్) 6 గ్రంధాలను స్వాధీనం చేసుకుంటాడు. దీంతో అంబికా ఆశ్రమానికి చెందిన విభా(రితిక నాయక్) అంబికా కొడుకు వేద(తేజ సజ్జ)ని వెతుక్కుంటూ వెళ్తుంది.

వేద ఓ అనాధగా పెరిగి స్క్రాప్, డూప్లికేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. విభా వేదని కలిసి ఇవన్నీ చెప్పినా మొదట పట్టించుకోడు. కానీ విభా.. వేదకు తన గతం, కడుపులో ఉన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చేలా చేయడం, లామా మనుషులు విభా మీద అటాక్ చేయడంతో వేద ఇవన్నీ నమ్మి మిరాయ్ ఆయుధాన్ని తీసుకురావడానికి, 9వ గ్రంధాన్ని కాపాడటానికి, లామాని ఎదుర్కోవడానికి బయలుదేరుతాడు. మరి వేద మిరాయ్ ని ఎలా సాధించాడు? అసలు మిరాయ్ ఆయుధం ఏంటి? ఎవరిది? 9వ గ్రంధం ఎక్కడుంది? మహావీర్ లామా కథేంటి? అతను ఎవరు? త్రేతాయుగానికి మిరాయ్ కి సంబంధం ఏంటి? మధ్యలో పోలీసులు వేద, విభా వెంట ఎందుకు పడతారు?.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Kishkindhapuri Review : ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ.. బెల్లంకొండ, అనుపమ ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

సినిమా విశ్లేషణ..

హనుమాన్ హిట్ తర్వాత తేజ సజ్జ మరోసారి డివోషన్, ఫాంటసీ తో వస్తుండటం, మిరాయ్ ట్రైలర్, టీజర్స్ బాగుండటంతో ముందు నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అశోకుడి కథతో సినిమా మొదలవుతుంది. ఆ తరవాత మహావీర్ లామా గురించి, వేద గురించి, విభా వేదని వెతకడంతో సాగుతుంది. వేదకు అన్ని తెలిసిన తర్వాత కథ ఆసక్తిగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ వేద పరిచయ సన్నివేశాలు సింపుల్ గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు ఓ గద్దతో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఆ గద్ద కథ మరింత ఆసక్తిగా ఉంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా వేద మిరాయ్ ని పట్టుకొని 9వ గ్రంధం కోసం వెళ్లడం, తన తల్లి గురించి తెలుసుకోవడం, లామా గురించి.. ఇదంతా ఆసక్తిగా సాగినా లామా ఫ్లాష్ బ్యాక్, అతను ఎందుకు ఇలా మారాడు అనేది మాత్రం రొటీన్ కథ. వేద తల్లి అంబికా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లు, ట్రైన్ సీక్వెన్స్, రాముడికి లింక్ చేస్తూ క్లైమాక్స్ ముగించడం, చివర్లో మళ్ళీ సీక్వెల్ కి లీడ్ ఇవ్వడం ఇవన్నీ అదిరిపోతాయి. సెకండ్ హాఫ్ లో పోలీసుల ట్రాక్ మాత్రం అవసర్లేకపోయినా పెట్టారు అనిపిస్తుంది. హనుమాన్ లో ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో ఆ ఎమోషన్ ఎక్కడో కొంత మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.

ప్రభాస్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్. చివర్లో మరో హీరో గెస్ట్ అప్పీరెన్స్ తో సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ బాగుంటుంది. సినిమా నుంచి ముందు రిలీజయి హిట్ అయిన వైబ్ ఉంది బేబీ.. సాంగ్ సినిమాలో లేదు. కథలో వాడిన కొన్ని సంసృత పదాలు, తాంత్రిక మాంత్రిక విద్యల గురించి సామాన్య ప్రేక్షకులకు అర్దమవడం కాస్త కష్టమే.(Mirai Review)

నటీనటుల పర్ఫార్మెన్స్..

తేజ సజ్జ ఓ పక్క అల్లరిచిల్లరిగా ఉండే కుర్రాడిగా తర్వాత యాక్షన్స్, ఎమోషన్స్ తో బాగా నటించాడు. మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ లో మరోసారి మెప్పించాడు. శ్రియా చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో మెప్పించింది. రితిక నాయక్ సింపుల్ గా ఒక సాధు మహిళగా బాగానే నటించింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాతో నటుడిగా మారి బాగానే నవ్వించారు. గెటప్ శ్రీను కూడా అక్కడక్కడా నవ్వించాడు. జయరాం అగస్త్య ముని పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. జగపతి బాబు కూడా తన పాత్రలో మెప్పించారు. డైరెక్టర్ వెంకటేష్ మహా ఓ పాత్రలో అలరిస్తాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Mirai X Review: మిరాయ్ ఎక్స్ రివ్యూ: సూపర్ హీరో తేజ సజ్జ.. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రాఫర్ దర్శకుడు కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి.  ఈ సినిమాకు విజువల్స్, గ్రాఫిక్స్ చాలా ప్లస్ అయ్యాయి. తక్కువ బడ్జెట్ లోనే VFX బాగా చేసారు. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కొత్తగా డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే సెట్ అయింది. సంసృత పదాలతో బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్స్ కోసం రాసిన సాంగ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. డైరెక్టర్ ఒక కల్పిత కథ తీసుకొని చరిత్రలో ఉన్న పాత్రలకు లింక్ చేసి చెడు మీద మంచి గెలవడం అనే కథాంశంతో బాగానే రాసుకున్నాడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘మిరాయ్’ సినిమా అశోకుడు ఇచ్చిన గ్రంధాలను ఓ వ్యక్తి స్వాధీనపరుచుకొని దేవుడు అవ్వాలని చూస్తే ఎలా ఎదుర్కొన్నారు, దానికి దైవం ఎలా సహకరించింది అని డివోషనల్ ఫాంటసీ కథాంశంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.