Ukraine
Ukraine : ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం యుక్రెయిన్ వైపే ఉంది. యుక్రెయిన్ ని స్వాధీనపరుచుకోవడానికి రష్యా యుద్ధానికి కూడా సిద్దపడింది. ఇప్పటికే యుక్రెయిన్ లో తమ బలగాలని భారీగా దించింది. యుక్రెయిన్ లో కొన్ని ప్రదేశాలలో బాంబులతో కూడా దాడి చేస్తుంది రష్యా. దీంతో అందరి చూపు యుక్రెయిన్ పై పడింది. యుక్రెయిన్ కి సినిమా రంగానికి కూడా అవినాభావ సంబంధం ఉంది.
యుక్రెయిన్ రాజధాని కైప్ తో పాటు మరి కొన్ని నగరాలు సినిమా షూటింగ్ లకు చాలా అనుగుణంగా ఉంటాయి. యుక్రెయిన్ లో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. యుక్రెయిన్ లో ఎప్పట్నుంచో హాలీవుడ్ సినిమాలు షూట్ చేస్తున్నాయి. చాలా హాలీవుడ్ సినిమాలు యుక్రెయిన్ లో షూటింగ్స్ జరుపుకున్నాయి. ఇంకా జరుపుకుంటున్నాయి. అక్కడ ఉన్న లొకేషన్స్, మంచు కురిసే ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, సముద్ర తీరాలు, తక్కువ ఖర్చుని ఆధారంగా చేసుకొని చాలా మంది షూటింగ్స్ ఇక్కడ నిర్వహించడానికి ఇష్టపడుతున్నారు.
మన భారతదేశ సినిమాలు కూడా గత కొద్ది కాలంగా యుక్రెయిన్ లో షూటింగ్స్ చేయడానికి సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని భారతీయ సినిమాలు అందులో మన తెలుగు సినిమాలు కూడా యుక్రెయిన్ లో షూటింగ్స్ ని జరుపుకున్నాయి. యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’. ఈ సినిమాలోని కొన్ని పాటలని యుక్రెయిన్ లో షూట్ చేశారు.
ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో 2.0’ కూడా యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో కూడా ఒక పాటని యుక్రెయిన్ లోనే చిత్రీకరించారు. ఆ తర్వాత కార్తీ హీరోగా నటించిన ‘దేవ్’ సినిమాలో చాలా సన్నివేశాలని, పాటలని యుక్రెయిన్ లో చిత్రీకరించారు. ఇటీవల వచ్చిన తమిళ ’99 సాంగ్స్’ సినిమాని కూడా యుక్రెయిన్ లోనే చిత్రీకరించారు. ఈ సినిమాలోని చాలా భాగం యుక్రెయిన్ లోనే చిత్రీకరించారు.
ఇక దేశం మొత్తం ఎదురు చూసే సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం యుక్రెయిన్ లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కి వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు. మరి యుక్రెయిన్ లో ఈ సినిమాలో ఏ సన్నివేశాలని చిత్రీకరించారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.
ఇలా ఇటీవల చాలా సినిమా యూనిట్స్ యుక్రెయిన్ వైపు ద్రుష్టి సారించాయి. అద్భుతమైన లొకేషన్స్ ఉండటంతో చిత్ర యూనిట్లు యుక్రెయిన్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో యుక్రెయిన్ లో సినిమా షూటింగ్స్ చేసే పరిస్థితి కనపడట్లేదు. దీంతో సినిమా రంగం వైపు నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని యుక్రెయిన్ కోల్పోనుంది. అంతే కాక అక్కడి అందమైన ప్రదేశాలని మనం చూసే అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి యుక్రెయిన్ పరిస్థితులు ఎప్పటికి సద్దుమణుగుతాయో చూడాలి.
Team #RRRMovie arrives in #Ukraine for the last schedule of the film… Excited????
— RRR Movie (@RRRMovie) August 3, 2021