చిన్న చిన్న డాన్స్ షోలలో గెలిస్తేనే పొగిడేస్తాం కదా? ఈ యువ డాన్సర్లు అమెరికాలోని ప్రఖ్యాత ‘అమెరికాస్ గాట్ టాలెంట్: ది చాంపియన్స్ షో’ (ఏజీటీ) రెండో సీజన్‌లో విజేతలుగా నిలిచారు. ముంబైకి చెందిన ‘వి అన్ బీటబుల్’ డ్యాన్స్ గ్రూప్ ఈ టాలెంట్ షోలో పెర్ఫార్మెన్స్ ఇరగదీశారు.
ఈ డ్యాన్స్ గ్రూప్‌లో వెళ్లిన 29 మందిలో చాలావరకు ముంబైలోని స్లమ్స్‌కు చెందిన పేదవాళ్లు. ‘వి అన్ బీటబుల్’ డ్యాన్స్ గ్రూప్ అద్వితీయమైన ప్రదర్శనతో షో లో అద్భుతంగా రాణించి ఖండాంతరాల్లో మన దేశపు ఖ్యాతిని చాటారు.
ముంబైకి చెందిన ఈ డ్యాన్స్ గ్రూప్ మొదట్లో ఇండియాలో వివిధ సంస్థలు నిర్వహించిన చాలా డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. డ్యాన్స్ ప్లస్ 4, ఇండియా బనేగా మంచ్ వంటి పోటీల్లో గెలిచి చివరకు అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొని పేరు తెచ్చుకుంది. గతేడాది నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. ఈసారి ఏకంగా విన్నర్‌గా నిలిచింది.
అమెరికా షోలో ‘వి అన్ బీటబుల్’ టీమ్ ఫైనల్స్‌కు చేరినప్పటి నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలు బాగా సపోర్ట్ చేశారు. టీమ్ విన్నర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ హీరోలు రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటివాళ్లు సోషల్ మీడియాలో సపోర్ట్ చేశారు. అంతేకాదు అమెరికాలోని ఎన్నారైలు సైతం సపోర్ట్ చెయ్యడంతో వీళ్లు విజేతలుగా నిలిచారు.