Nagarjuna Allari Naresh Naa Saami Ranga Movie Review and Rating Full Report
Naa Saami Ranga Review : విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ సినిమా ఈ సంక్రాంతికి నేడు జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు చేయగా.. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అంతా ముందు నుంచే భావించారు.
కథ విషయానికొస్తే.. కథని 1960ల్లో మొదలుపెడతారు. కృష్ణయ్య(నాగార్జున) ఓ అనాధ. ఆకలేస్తుందని అంజి(అల్లరి నరేష్) ఇంటికి వస్తే అతని తల్లి చేరదీస్తుంది. దీంతో కృష్ణయ్య ఆ కుటుంబంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో వాళ్ళు కట్టాల్సిన అప్పు కట్టాలి లేదా ఇల్లు జప్తు చేసుకుంటాను అని ఓ వడ్డీవ్యాపారి రాగా ఆ ఊరి పెద్దయ్య(నాజర్) వచ్చి డబ్బులిస్తాడు. దీంతో కృష్ణయ్య పెద్దయ్య దగ్గర ఉండి ఆ ఊరిని, పెద్దయ్యని చూసుకుంటూ ఉంటాడు. కృష్ణయ్య, అంజి అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు.
20 ఏళ్ళ తర్వాత అసలు కథలోకి తీసుకువస్తారు. భాస్కర్(రాజ్ తరుణ్) పక్కూరి ప్రసిడెంట్ కూతురు(రుక్సార్)ని ప్రేమించాడని తెలియడంతో వాళ్ళు భాస్కర్ ని చంపడానికి వస్తే కృష్ణయ్య కాపాడుతాడు. భాస్కర్ కృష్ణయ్యకి ప్రేమ ఉందా అని అంజిని అడగడంతో గతంలో చిన్నప్పటి నుంచి కృష్ణయ్య, వరాలు(ఆషిక రంగనాధ్)ప్రేమ గురించి, వాళ్ళ గిల్లికజ్జాలు, ఆ తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు, కృష్ణయ్య వల్ల పెద్దయ్య కొడుకు, వరాలు పెళ్లి ఆగిపోవడం.. అంటూ కథ మొత్తం చెప్తాడు.
అదే సమయానికి దుబాయ్ నుంచి ఊళ్లోకి వచ్చిన పెద్దయ్య కొడుకు దాస్ వరాలుతో మిస్ బిహేవ్ చేయడంతో అంజి చూసి అతనితో గొడవకు దిగడంతో అసలు కథ మొదలవుతుంది. దాస్ అంజి, కృష్ణయ్యలని చంపాలని, వరాలుని దక్కించుకోవాలని, మరో పక్క పక్కూరి ప్రసిడెంట్ భాస్కర్ ని చంపాలని చూస్తుంటారు. మరి ఈ పగలు ప్రతీకారాలు ఎలా ముందుకెళ్లాయి? కృష్ణయ్య, వరాలు ఒక్కటయ్యారా? పెద్దయ్య కొడుకు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. నా సామిరంగ సినిమా మలయాళం ‘పోరింజు జొస్ మరియమ్’ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఆ రీమేక్ ఛాయలు ఎక్కడా కనపడకుండా మన ఒరిజినల్ తెలుగు సినిమాగా పూర్తిగా మార్చారు. ఫస్ట్ హాఫ్ లో కృష్ణయ్య, అంజిల బాల్యం, కృష్ణయ్య, వరాలు ప్రేమ కథ, అంజి పెళ్లి, దాస్ తో గొడవతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ, కామెడీతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ లో పెద్దయ్య కొడుకు దాస్ తో గొడవ జరగడంతో ఒక యాక్షన్ సీన్ తో హై వస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా దాస్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ పండించి క్లైమాక్స్ లో రివెంజ్ డ్రామాలా యాక్షన్ సీన్ తో ముగిస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ముందుకి, వెన్కక్కి వెళ్తూ ఉంటుంది. దీంతో ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సినిమా అంతా 1980ల్లో, అంతకు ముందు అంబాజీపేట అనే ఓ గ్రామంలో జరిగే కథలా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా నవ్వించి సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో నడిపించారు. సినిమాలో కూడా సంక్రాంతి చుట్టూ కథని రాసుకోవడం విశేషం.
నటీనటుల విషయానికొస్తే.. నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. ప్రేమ కోసం తపన పడే అబ్బాయిలా, మరో వైపు తన వాళ్ళ కోసం నిలబడి పోరాడేవాడిలా మెప్పించాడు. యాక్షన్ సీన్స్ లో నాగ్ కి మంచి ఎలివేషన్స్ పడ్డాయి. అల్లరి నరేష్ కి కూడా నాగార్జునతో సమానంగా క్యారెక్టర్ పడింది. నరేష్ ఓ పక్క కామెడీతో నవ్విస్తూ మరో పక్క ఏడిపిస్తాడు కూడా. సినిమాకి హీరోయిన్ ఆషిక రంగనాథ్ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రేమ కథలో ఓ యువతిలా, తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన పాత్రలో వ్యత్యాసం చూపిస్తూ ఆషిక బాగా నటించింది. ఈ సినిమాతో ఆషికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
మిర్నా మీనన్ అల్లరి నరేష్ భార్యగా మెప్పించింది. రుక్సార్, రాజ్ తరుణ్ లు ప్రేమ జంటగా పర్వాలేదనిపించారు. ఇద్దరికీ స్క్రీన్ మీద అంత స్కోప్ లేకపోయినా కథ వీళ్ళతోనే మొదలవడం విశేషం. ఇక వరాలు తండ్రి పాత్రలో రావు రమేష్, పెద్దయ్యగా నాజర్, అతని చిన్న కొడుకు విలన్ పాత్రలో డ్యాన్సింగ్ రోజ్ మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. నా సామిరంగ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 40 ఏళ్ళ క్రితం కథ, పల్లెటూరి కథకు తగ్గట్టు లొకేషన్స్, విజువల్స్ చక్కగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. ఈ సినిమాకు దాశరధి శివేంద్ర కెమెరామెన్ గా పనిచేశారు. హనుమాన్ సినిమాకు కూడా ఈయనే కెమెరామెన్ కావడం విశేషం. ఇక మ్యూజిక్ ఎమోషనల్ BGM, కొన్ని పాటలు బాగున్నా యాక్షన్ సీన్స్ లో ఇంకా బాగా ఇవ్వొచ్చు అనిపిస్తుంది. రెండు పాటలు మాత్రం వినడానికి బాగుంటాయి. మిగిలినవి పర్వాలేదనిపిస్తుంది.
ప్రేమ కథలు, ఎంటర్టైన్మెంట్ కి రివెంజ్ డ్రామా జోడించి మెప్పించినా కథనం మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నాగార్జునకి ఇండస్ట్రీలో కొత్త దర్శకులని పరిచయం చేస్తాడని మంచి పేరుంది. దానికి తగ్గట్టే విజయ్ బిన్నీ కూడా కష్టపడ్డాడు. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి.
మొత్తంగా నా సామిరంగ సినిమా ప్రేమ కథలు ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ రివెంజ్ డ్రామా. దాన్ని సంక్రాంతి పండగకు తగ్గట్టు అందంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.