శివ ప్రసాద్ సినీ ప్రయాణం

నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు నారమల్లి శివ ప్రసాద్ 2019 సెప్టెంబర్ 21న అనారోగ్యంతో మృతి చెందారు..

  • Publish Date - September 21, 2019 / 09:44 AM IST

నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు నారమల్లి శివ ప్రసాద్ 2019 సెప్టెంబర్ 21న అనారోగ్యంతో మృతి చెందారు..

శివ ప్రసాద్‌కు చిన్నప్పటి నుంచి సాహిత్యం, కళలు, సినిమా నటన అంటే ఇష్టం ఉండడంతో.. చిన్నతనంలోనే అనేక నాటకాల్లో నటించారు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. చిరంజీవి ‘ఖైదీ’ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన శివ ప్రసాద్.. ‘యముడికి మొగుడు’, ‘మాస్టర్ కాపురం’, ‘ఆటాడిస్తా’, ‘సత్యభామ’, ‘కితకితలు’, ‘జై చిరంజీవ’, ‘సుభాష్ చంద్రబోస్’, ‘లక్ష్మీ’, ‘ఒక్కమగాడు’, ‘ద్రోణ’, ‘మస్కా’, ‘తులసి’, ‘బలాదూర్’, ‘కుబేరులు’, ‘పిల్ల జమీందార్’, ‘దూసుకెళ్తా’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన ‘డేంజర్’ సినిమాకు గానూ ఆయన బెస్ట్  విలన్‌గా ‘నంది’ అవార్డునందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మెప్పించారాయన.. ‘ప్రేమ తపస్సు’, ‘టోపీ రాజా స్వీటీ రోజా’, ‘ఇల్లాలు’, ‘కొక్కొరో కో’ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజకీయాల్లో ప్రవేశించి ఎంఎల్ఎగా, ఎంపీగా, 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

Read Also : శివ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు..

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం కొనసాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నారాయన. ప్రముఖ సినీ నటి రోజాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. నటుడిగా ప్రేక్షకులను, రాజకీయ నాయకుడిగా ప్రజలను అలరించిన శివ ప్రసాద్.. 2019 సెప్టెంబర్ 21న కన్నుమూశారు.