ఫస్ట్ డైరెక్టర్‌తోనే 25వ సినిమా : నాని కొత్త మూవీ ‘వి’

తనని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతోనే నాని తన 25వ సినిమాని చెయ్యబోతున్నాడు.

  • Publish Date - April 29, 2019 / 06:00 AM IST

తనని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతోనే నాని తన 25వ సినిమాని చెయ్యబోతున్నాడు.

నేచురల్ స్టార్ నాని జెర్సీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం మనం ఫేమ్, విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నాడు. నాని తన 25వ సినిమాకి ఓ సర్‌ప్రైజ్ ఉండబోతుందని ఇటీవల చెప్పాడు. ఆ సస్పెన్స్‌కి తెరదించుతూ, నాని హీరోగా నటించబోయే 25వ సినిమాకి సంబంధించిన వివరాలు ప్రకటించారు నిర్మాతలు. నానిని అష్టా-చమ్మాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతోనే నాని తన 25వ సినిమాని చెయ్యబోతున్నాడు. జెంటిల్ మన్ తర్వాత ఈ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడవ సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమా మల్టీస్టారర్.. నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటించనున్నాడు.

అదితీ రావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్స్. ఈ మూవీకి ‘వ్యూహం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘V’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, లోగో రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ‘V’ ని రెడ్ కలర్‌లో డిజైన్ చేసారు. తనని హీరోగా లాంచ్ చేసిన దర్శకుడు, 25వ సినిమాతో తనని రీ-లాంచ్ చేస్తున్నారని, ఈ సినిమాలో సుధీర్ కూడా జాయిన్ అవడం హ్యాపీగా ఉందని నాని ట్వీట్ చేసాడు. సినిమాలో ఉన్న ట్విస్టులలో ఫస్ట్ ట్విస్ట్ ఇది. వెల్ కమ్ నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించబోయే ఈ సినిమా నుండి ఊహించలేని విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి.. అని సుధీర్ బాబు ట్వీట్ చేసాడు.

అష్టా-చమ్మా, జెంటిల్ మన్ సినిమాలతో నానికి, సమ్మోహనంతో సుధీర్ బాబుకి మంచి హిట్ సినిమాలు ఇచ్చిన ఇంద్రగంటి, ఇద్దరితో కలిపి ఎలాంటి సినిమా తీస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జెంటిల్ మన్, నిన్నుకోరి తర్వాత నానితో నివేదా నటిస్తున్న మూడవ సినిమా ఇది. సమ్మోహనం తర్వాత సుధీర్‌తో అదితి చేస్తున్న రెండవ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి కెమెరా : పిజి విందా, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం : అమిత్ త్రివేది.