Anaganaga Oka Raju Review
Anaganaga Oka Raju Review : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో పై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది. చమ్మక్ చంద్ర, మహేష్, జబర్దస్త్ సత్య, గోపరాజు రమణ, రావు రమేష్, తారక్ పొన్నప్ప.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.(Anaganaga Oka Raju Review)
జమిందార్ వంశానికి చెందిన రాజు(నవీన్ పోలిశెట్టి) తన తాత ఆస్తులు పోగొట్టినా డబ్బులు లేకపోయినా కవర్ చేస్తూ రాజులుగా, ఊరి పెద్దగా చలామణి అవుతూ ఉంటాడు. ఓ చుట్టాల పెళ్లికి వెళ్తే డబ్బులు లేవని అవమానించి పంపిస్తారు. ఆ పెళ్లి కొడుకు బాగా డబ్బున్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. దీంతో రాజు కూడా బాగా డబ్బున్న అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
అలాంటి సమయంలో రాజు ఊళ్ళో జరిగే జాతరకు పెదపాలెం నుంచి భూపతి రాజు(రావు రమేష్), ఆయన కూతురు చారులత(మీనాక్షి చౌదరి) వస్తారు. వీళ్లకు బాగా డబ్బు, ఆస్తులు ఉన్నాయని తెలిసి చారులతని ప్లాన్స్ వేసి మరీ పడేస్తాడు. పెళ్లి అయ్యాక భూపతి రాజు అల్లుడు రాజుకి ఓ లెటర్ రాసి మాయమైపోతాడు. ఆ లెటర్ లో ఏం ఉంది? పెళ్లి తర్వాత రాజుకి భార్య చారులత ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? పెదపాలెంకు అల్లుడుగా వెళ్లిన రాజు అక్కడ ఏం చేస్తాడు ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్విటర్ రివ్యూ.. నవ్వించేస్తున్న నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. తన అన్ని సినిమాలతో నవ్వించి మెప్పించాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ వస్తుండటంతో ఈ సినిమాపై బానే అంచనాలు నెలకొన్నాయి. ఇక గోదావరి బ్యాక్ డ్రాప్ కావడం, ప్రమోషనల్ వీడియోలు కొత్తగా ఉండటం, సాంగ్స్ హిట్ అవ్వడం, పండక్కి రావడంతో ఈ సినిమాకు రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ వచ్చింది.
ఫస్ట్ హాఫ్ రాజు లైఫ్ స్టైల్, రాజు గొప్పలు, పెళ్లి బాధలు, హీరోయిన్ ని పడేయడానికి రాజు పడే కష్టాలతో సరదా సరదాగా నవ్విస్తూ సాగిపోతుంది. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ తో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ ట్విస్ట్ ముందే ఊహించేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో రాజు ఏం చేస్తాడు, అతనికి ఎదురైన సమస్యలు ఏంటి అని ఓ పక్క సరదాగా చూపిస్తూనే మరో పక్క సీరియస్ గా సాగుతుంది. చివర్లో ఓ ఎమోషన్ తో కన్నీళ్లు కూడా పెట్టిస్తారు.
ఫస్ట్ హాఫ్ అంతా బోర్ కొట్టకుండా సాగినా సెకండ్ హాఫ్ కథ మొత్తం మారిపోయి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. దీంతో అది ఇంకో కథేమో అన్నట్టు సాగుతుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాని వాడుకొని వైరల్ అయిపోయినట్టు చాలా సినిమాల్లో చూపించినట్టే ఈ సినిమాలో కూడా అవే సీన్స్ రొటీన్ గా ఉంటాయి. పొలిటికల్ సెటైర్స్ బాగానే వేశారు. అసలు లైఫ్ ని సీరియస్ గా తీసుకోని, డబ్బే ముఖ్యం అనుకునే రాజు ఒక్కసారిగా ఓ సంఘటనతో చాలా ఎమోషనల్ గా, మంచిగా మారడం అనేది అంతగా కన్విన్స్ చేయలేకపోయాడు.
ఎమోషనల్ సీన్స్ పండినా హీరో క్యారెక్టర్ మారిపోయింది అనేది మాత్రం బలంగా చూపెట్టలేకపోయారు. రాజు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీ, అతని మనుషులు ఏంటి అనేది కరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇన్నాళ్లు నవీన్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేయగా ఈ సినిమాలో మాత్రం కాస్త కమర్షియల్ హంగులు పూసుకొని కొత్తగా కనిపించే ప్రయత్నం చేసాడు. మొత్తానికి పండక్కి మామ బాధ్యత మోసిన అల్లుడు కథతో నవీన్ ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చాడు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమాని.
నవీన్ పోలిశెట్టి గోదావరి రాజుల కుర్రాడిగా చాలా యాక్టివ్ గా బాగా నటించి నవ్వించి మెప్పించాడు. ఆల్మోస్ట్ సినిమా అంతా ప్రతి ఫ్రేమ్ లో తనే ఉండి నడిపించాడు నవీన్. మీనాక్షి చౌదరి క్యూట్ గా కనిపిస్తూ అలరించింది. డ్యాన్సులతో కూడా అదరగొట్టింది ఈసారి. రావు రమేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో బాగానే మెప్పించారు. జబర్దస్త్ సత్య, చమ్మక్ చంద్ర, మహేష్.. మిగిలిన నటీనటులు బాగానే నటించారు. బుల్లిరాజు రేవంత్ అక్కడక్కడా కనిపించి నవ్వించాడు. తారక్ పొన్నప్ప నెగిటివ్ షేడ్స్ పాత్రలో మెప్పించాడు. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ శాన్వి మేఘన, గెస్ట్ రోల్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మెరిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా కలర్ ఫుల్ గా ఉన్నాయి. గోదావరి బ్యాక్ డ్రాప్ కావడంతో లొకేషన్స్ కూడా అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కుదిరింది. సాంగ్స్ బాగున్నాయి. పాత కథని కొత్తగా నవ్వించే ప్రయత్నం చేసేలా నవీన్, దర్శకుడు కలిసి బాగానే రాసుకొని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా సితార సంస్థ బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇస్తుందని తెలిసిందే.
మొత్తంగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా సంక్రాంతి పండక్కి నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.