Mana ShankaraVaraPrasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ రివ్యూ.. బాస్ అదరగొట్టాడుగా.. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్..
పండక్కి ఈ సినిమాని చూడటానికి ఫ్యామిలీస్ అంతా రెడీ అయిపోయారు. (Mana ShankaraVaraPrasad Garu)
Mana ShankaraVaraPrasad Garu Review
Mana ShankaraVaraPrasad Garu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసారు. నయనతార, క్యాథరిన్ త్రెసా, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Mana ShankaraVaraPrasad Garu)
కథ విషయానికొస్తే..
శంకర వరప్రసాద్(చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్ర హోమ్ మంత్రి వద్ద తన టీమ్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. గతంలో వరప్రసాద్ బాగా డబ్బున్న అమ్మాయి శశిరేఖ(నయనతార)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శశిరేఖ తండ్రి(సచిన్ ఖేద్కర్) వీళ్లిద్దరి మధ్య విబేధాలు తెచ్చి విడిపోయేలా చేస్తారు. వరప్రసాద్ ఇద్దరి పిల్లల్ని కూడా దూరం చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత తన పిల్లలు ఇంటికి దూరంగా ఓ స్కూల్ లో చదువుతున్నారని తెలిసి అక్కడికి వెళ్లి వాళ్లకు దగ్గర అవ్వాలని PT సర్ గా జాయిన్ అవుతాడు వరప్రసాద్.
కానీ శశిరేఖ తన పిల్లలకు తండ్రి మంచివాడు కాదు అని అసహ్యంతో, అసలు తండ్రి ఎవరో తెలియకుండా పెంచిందని తెలుస్తుంది. మరి వరప్రసాద్ పిల్లలకు దగ్గరయ్యాడా? మళ్ళీ శశిరేఖ జీవితంలోకి ఎలా వెళ్ళాడు? శశిరేఖ తండ్రి ఏం చేసాడు? వెంకీ గౌడ(వెంకటేష్) పాత్ర ఏంటి? శశిరేఖ – వరప్రసాద్ కలుస్తారా? పిల్లలకు నాన్న గురించి తెలుస్తుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావిపూడి సంక్రాంతి పండక్కి రావడం, ఈసారి చిరంజీవి సినిమా, వెంకటేష్ గెస్ట్ రోల్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ కి కొన్ని డేస్ ముందు రిలీజయిన హుక్ స్టెప్ సాంగ్ తో ఒక్కసారిగా సినిమాపై హైప్ పెరిగిపోయి సోషల్ మీడియా షేక్ అయింది. దీంతో పండక్కి ఈ సినిమాని చూడటానికి ఫ్యామిలీస్ అంతా రెడీ అయిపోయారు.
ఫస్ట్ హాఫ్ అంతా వరప్రసాద్ ఎంట్రీ, అతని ఉద్యోగం, శశిరేఖతో ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ, విడిపోవడం, పిల్లలతో కలవడంతో సరదా సరదాగా కామెడీతో, పిల్లల ఎమోషన్ తో సాగిపోతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాము ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కి ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంటుంది. అయితే ఆ ట్విస్ట్ ముందే ఊహించేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కామెడీతో పాటు కథ, ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్, వెంకటేష్ సీన్స్ తో ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క కాస్త సీరియస్ కథని నడిపించాడు.
ఫస్ట్ హాఫ్ లో చిరు – నయనతార లవ్ స్టోరీ క్యూట్ గా కొత్తగా అనిపిస్తుంది. పిల్లల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. భార్యాభర్తల ఎమోషన్, విలువలు, ఇటీవల భర్తల మీద జరుగుతున్న దాడుల గురించి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక వెంకటేష్ తో ఉన్న సీన్స్ అయితే థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్ లో వెంకటేష్ చిరు డ్యాన్స్ సీన్స్ కి టాప్ లేచిపోవాల్సిందే. పాత పాటలతో మంచి హై ఫీల్ ఇస్తారు. ఇక క్లైమాక్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేసారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర అందర్నీ నవ్వించి మెప్పించింది. అదే బుల్లిరాజు ఈ సినిమాలో ఓ పది నిముషాలు నవ్వించి హైలెట్ అయ్యాడు.
వెంకటేష్ ఎలాంటి పాత్రలో వస్తాడో అసలు ఎవరూ ఊహించలేరు. ఆ పాత్రని అంత కొత్తగా రాసుకున్నారు. చిరు – వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ కథ సింపుల్ గా సిల్లీగా ఉన్నా బాగానే ఉంటుంది. అయితే సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోయినా రెండు మూడు చోట్ల మాత్రం కామెడీ బలవంతంగా చేసినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ కథ అజిత్ విశ్వాసం కథ మెయిన్ పాయింట్ ఒకటే. అలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినా ఈ సినిమా కథనంతో ప్రేక్షకులని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారు.
మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి అందర్నీ నవ్వించి హిట్ కొట్టేసాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి చూడాల్సిన సినిమా. చిరంజీవి ఫ్యాన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా ఏళ్ళ తర్వాత బాస్ తన కామెడీ టైమింగ్, డ్యాన్స్ స్టైల్ తో, అదిరిపోయే లుక్స్ తో వింటేజ్ మెగాస్టార్ ని చూపించారు. ఫ్యాన్స్ కి పండగే.

నటీనటుల పర్ఫార్మెన్స్..
చిరంజీవి, వెంకటేష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గి కొత్త లుక్ లో సరికొత్తగా కనపడటమే కాక తన పాత కామెడీ టైమింగ్ ని తీసుకొచ్చి ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించారు. లుక్స్ పరంగా చాలా కష్టపడ్డారు అని తెలుస్తుంది. ఇక యాక్షన్స్ తో, డ్యాన్స్ తో, ఎమోషన్ తో మరోసారి అదరగొట్టేసాడు బాస్. వెంకటేష్ బాగా డబ్బున్న వ్యక్తిగా స్టయిలిష్ లుక్స్ లో కనిపించి చిరుతో కలిసి డ్యాన్సులు వేస్తూ చాలా బాగా నటించారు.
భర్తకు దూరమైన భార్య, బాగా డబ్బున్న అమ్మాయి పాత్రలో నయనతార సింపుల్ గా కనిపిస్తూ మెప్పించింది. చిరంజీవి పిల్లలుగా చేసిన ఇద్దరూ క్యూట్ గా నటించి మెప్పించారు. మామ పాత్రలో సచిన్ ఖేద్కర్ బాగా నటించారు. చిరు టీమ్ గా క్యాథరిన్ త్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం పర్ఫెక్ట్ గా సరిపోయారు. చిరంజీవి తల్లి పాత్రలో జరీనా వాహబ్ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరోసారి ఇందులో కాసేపే కనిపించినా ఫుల్ గా నవ్వించాడు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే చాలా కలర్ ఫుల్ గా రిచ్ గా కనిపించాయి. విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఘరానా మొగుడు మ్యూజిక్ ని రీమిక్స్ చేసి చిరు బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాగా వాడారు. ఇక పాటలు కూడా మెప్పిస్తాయి. హుక్ స్టెప్ సాంగ్ కి థియేటర్స్ ఊగిపోవాల్సిందే.
ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కొంత అక్కరలేని కామెడీ, సాగదీత ఎడిట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఎడిటింగ్ ప్యాట్రన్ ఇద్దరు హీరోలను చూపిస్తూ చాలా బాగా చేసారు. ఇక అనిల్ రావిపూడి ఫుల్ గా నవ్విస్తూనే ఎప్పట్లాగే ఓ మెసేజ్ ఇస్తూ బాగా రాసి తెరకెక్కించాడు. ఇద్దరు హీరోలను చాలా బాగా డీల్ చేసాడు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పండక్కి ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తూనే భార్యాభర్తల బంధం గురించి మంచి మెసేజ్ ఇస్తుంది. ఫ్యామిలీలతో కలిసి హ్యాపీగా చూసేయోచ్చు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
