Darshini Movie Review : ‘దర్శిని’ మూవీ రివ్యూ.. భవిష్యత్తుని ముందే చూస్తే..
దర్శిని సినిమా నేడు మే 17న థియేటర్స్ లో రిలీజయింది.

New Suspense Thriller Darshini Movie Review and Rating
Darshini Movie Review : వికాస్, శాంతిప్రియ జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘దర్శిని’. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా వచ్చింది. దర్శిని సినిమా నేడు మే 17న థియేటర్స్ లో రిలీజయింది. టీజర్, ట్రైలర్స్ తో భవిష్యత్తు ముందే కనిపిస్తే ఏమవుతుంది అనే కథాంశంతో ఉండబోతున్నట్టు ఆసక్తి పెంచారు.
కథ విషయానికొస్తే.. సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య)ముగ్గురు ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి కొన్ని రోజులు ఔటింగ్ కి వెళదామని డాక్టర్ దర్శిని అనే సైంటిస్ట్ కి చెందిన ఫామ్ హౌస్ కి వెళ్తారు. ప్రియ అన్ని రూమ్స్ చూస్తుంటే అనుకోకుండా ఓ రూమ్ లోకి వెళ్లగా అక్కడ ఓ పెన్ సెన్సార్ దొరుకుతుంది. ఆ పెన్ సెన్సార్ నొక్కగానే తన ఎదురుగా ఒక మిషిన్ యాక్టివేట్ అయి స్క్రీన్ పై భవిష్యత్తుని చూపిస్తుంది. కాని అది భవిష్యత్తు కాదు సీక్రెట్ కెమెరాలతో మనల్ని ఎవరో చూస్తున్నారు అని సంతోష్, లివింగ్ స్టోన్ అనుకుంటారు. ఆ స్క్రీన్ పై చూసింది నెక్స్ట్ డే తమ లైఫ్ లో జరగడంతో భవిష్యత్తు చూపించే యంత్రం అని అర్ధమవుతుంది. ఎప్పుడైతే ఆ మిషిన్ యాక్టివేట్ అయిందో ప్రతి రోజు నెక్స్ట్ డే అదే టైంకి జరిగేదాన్ని చూపిస్తుంది. బయటకి వెళ్ళింది అని చెప్పిన డాక్టర్ దర్శిని ఇంకా రాకపోవడంతో ఎక్కడుంది అని వెతుకుతుంటే అదే ఫామ్ హౌస్ లో దర్శిని శవంలా కనిపిస్తుంది. భవిష్యత్తు మిషన్ పై లివింగ్ స్టోన్ కి ఆశ పుట్టి ఆ ఫామ్ హౌస్ నుంచి కదలడు. అదే సమయంలో ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి ఎవరో బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? భవిష్యత్తు మిషిన్ లో వీళ్లకు ఏం చూపించింది? ఈ ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? పోలీస్ సిస్టర్ ఎవరు? ఆమెకు, మిషిన్ కి ఉన్న సంబంధం ఏంటి? ముగ్గురు ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది తెరపై చూడాల్సిందే.
Also Read : Vidya Vasula Aham : ‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ.. కొత్త జంట మధ్య అహంతో కలహాలు వస్తే..
సినిమా విశ్లేషణ.. సస్పెన్స్ థ్రిల్లర్ కథకి సైన్స్ ఫిక్షన్ జత చేసారు. భవిష్యత్తు చూపించే యంత్రం అంటూ కథపై ఆసక్తి కలిగించారు. కథనం మాత్రం కొంచెం సాగతీతగా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ప్రియ – వికాస్ ల మధ్య ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ కి ముగ్గురు ఫ్రెండ్స్ ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి వచ్చేలా చేసారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు ఏం జరుగుతుంది అని ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే సినిమా చూస్తే సన్నివేశాల విషయంలో కథ కంటిన్యుటీలో కొన్ని సందేహాలు వస్తాయి. సినిమాలో లివింగ్ స్టోన్ క్యారెక్టర్ తో మాత్రం అక్కడక్కడా నవ్వించారు. తక్కువ క్యారెక్టర్స్ తో ఆల్మోస్ట్ సింగిల్ లొకేషన్ లో కథని ఆసక్తిగా నడిపించారు. కొన్ని సీన్స్ లో భయపెట్టారు కూడా.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటించారు. వికాస్, శాంతి ప్రియ జంటగా మెప్పించారు. లివింగ్ స్టోన్ మాత్రం ఫుల్ కామెడీతో నవ్వించాడు. మిగిలిన పాత్రలు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపిస్తుంది. సింగిల్ లొకేషన్ లో ఆల్మోస్ట్ కథని నడిపించారు. పాటలు మాత్రం మెలోడీగా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం బెటర్ గా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. దర్శకుడిగా ప్రదీప్ అల్లు మొదటి సినిమాలో పర్వాలేదనిపించారు. చిన్న సినిమా కావడంతో ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.
మొత్తంగా ‘దర్శిని’ సినిమా జరగబోయే భవిష్యత్తు చూపించే మిషన్, దాని కోసం కొంతమంది ఏం చేసారు అని ఆసక్తిగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.