Nikhil Siddhartha : చీరాల ప్రజల కోసం పనిచేస్తున్న నిఖిల్.. సమస్య చెప్పగానే ఆ ఎమ్మెల్యే తరపున తీరుస్తున్న హీరో..

ఇకపై చీరాలలో ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వస్తే తీరిపోతుంది అనే భరోసా కల్పించాడు హీరో నిఖిల్.

Nikhil Siddhartha : హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం భారీ పీరియాడిక్ సినిమా స్వయంభు షూట్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో నిఖిల్ బంధువు, నిఖిల్ కి మామయ్య వరుస అయ్యే MM కొండయ్య చీరాలలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు. ఎన్నికల ముందు నిఖిల్ చీరాలలో తన మామయ్య MM కొండయ్య తరపున ప్రచారం చేసాడు. గెలిచిన తర్వాత కూడా తన మామయ్యతో కలిసి నారా లోకేష్ ని కలిసాడు.

నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందిస్తూ ఉంటాడు. చీరాలలో తన మామయ్యకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి చీరాలకు సంబంధించిన అనేక అంశాలపై స్పందిస్తున్నాడు నిఖిల్. తాజాగా ఓ చీరాల వ్యక్తి.. చీరాలలో పువ్వాడ వారి వీధిలో, ఓ హాస్పిటల్ ముందు ఇలా చెత్త వేసి ఉంటుందని, ఎవరూ పట్టించుకోవట్లేదు, క్లీన్ చెయ్యట్లేదు అని అక్కడ చెత్త ఉన్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చీరాల మున్సిపాలిటీని, స్వచ్ఛ భారత్ ని ట్యాగ్ చేసాడు.

Also Read : Vithika Sheru : మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. స్టేజిపై ఎమోషనల్ అయిన వరుణ్ సందేశ్ భార్య..

అయితే ఈ పోస్ట్ లో నిఖిల్ ని ట్యాగ్ చేయనప్పటికీ నిఖిల్ స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకొని తన మామయ్యతో మాట్లాడి అక్కడికి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి క్లీన్ చేయించాడు. మున్సిపాలిటీ సిబ్బంది క్లీన్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. వెంటనే పని చేయించాము, అక్కడ అంతా క్లీన్ చేయించాము అని పోస్ట్ చేసాడు నిఖిల్. దీంతో నిఖిల్ ని అందరూ అభినందిస్తున్నారు.

నిఖిల్ ని ఎవరూ అడక్కపోయినా తన మామయ్య కోసం, ప్రజల కోసం చీరాల నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇకపై చీరాలలో ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వస్తే తీరిపోతుంది అనే భరోసా కల్పించాడు హీరో నిఖిల్. దీంతో నిఖిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నిఖిల్ కు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు