NTR Movies : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండటంతో దేవర పార్ట్ 1 సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు.
ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ సినిమా కావడం, అది కూడా స్పై యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వార్ 2 సినిమా వచ్చే సంవత్సరం 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది.
Also Read : Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పవన్ సంచలన నిర్ణయం.. ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి..
వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా రాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాని నిన్నే పూజా కార్యక్రమాలతో ప్రకటించారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఎన్టీఆర్ – నీల్ సినిమా 2026 జనవరి 9న వస్తుందని ప్రకటించారు.
ఈ మూడు సినిమాల తర్వాత దేవర పార్ట్ 2తో పాటు త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంటుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ లైనప్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఎన్టీఆర్ లైనప్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.