Paagal Vs Kadal : ‘పాగల్ వర్సెస్ కాదల్’ మూవీ రివ్యూ..

పాగల్ వర్సెస్ కాదల్ రెండు ప్రేమ కథల మధ్య జరిగే ఒక కామెడీ లవ్ ఎంటర్టైనర్ సినిమా.

Paagal Vs Kadal Movie Review and Rating

Paagal Vs Kadal Movie Review : విజయ్ శంకర్, విషిక జంటగా తెరకెక్కిన సినిమా పాగల్ వర్సెస్ కాదల్. శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మాణంలో రాజేశ్ ముదునూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన పాగల్ వర్సెస్ కాదల్ నేడు ఆగస్టు 9న రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే .. ఓ వ్యక్తి తాగి న్యూసెన్స్ చేస్తున్నాడనే కంప్లైంట్ రావడంతో పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్), ఎస్ఐ (బ్రహ్మాజీ) అక్కడికి వెళ్తారు. ఆ తాగిన వ్యక్తి బాధతో తాగుతున్నాను అని అతని ఫ్రెండ్ స్టోరీ చెప్తాడు. సివిల్ ఇంజినీర్ గా పనిచేసే కార్తీక్ (విజయ్ శంకర్) ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. కానీ ప్రియ శాడిస్ట్ గా బిహేవ్ చేస్తుంటుంది. ప్రియ చేసే పనులన్నీ భరిస్తుంటాడు కార్తీక్. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్. అతన్ని కార్తీక్ సోదరి అమృత(అనూహ్య) లవ్ చేసినా మనోజ్ యాక్సెప్ట్ చేయడు. అతడు కూడా సైకోగా బిహేవ్ చేస్తాడు. మరి సైకో మైండ్ సెట్స్ ఉన్న మనోజ్, ప్రియలతో ఇన్నోసెంట్ కార్తీక్, అతని సోదరి అమృత ఎలా కలిశారు అన్నది తెరపై చూడాల్సిందే.

Also Read : Simbaa : ‘సింబా’ మూవీ రివ్యూ.. అనసూయ సినిమా ఎలా ఉందంటే?

సినిమా విశ్లేషణ.. పాగల్ వర్సెస్ కాదల్ ఒక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్. ప్రేమ కథలు, కామెడీ తో ఈ సినిమాని తెరకెక్కించారు. సాధారణంగా ప్రేమికుల్లో ఎవరో ఒకరు తమ అతి ప్రేమతోనో, అవతలి వాళ్ళు దూరం అవుతారనో, అనుమానంతోనో ఒక రకమైన శాడిజాన్ని చూపిస్తారు. ఒక్కోసారి అది కామెడీగా, ఒక్కోసారి పాపం అనిపించేలా ఉంటుంది. ఈ సినిమాల్లో ప్రేమ కథలని కూడా అలాగే డిజైన్ చేసుకున్నారు. కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్.. ఈ నాలుగు క్యారెక్టర్స్ ని కూడా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ క్యారెక్టర్ మూవీలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పటి జనరేషన్ ప్రేమలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ప్రేమలో అనుమానం కాదు నమ్మకం ఉండాలి అనే పాయింట్ తో ఈ పాగల్ వర్సెస్ కాదల్ సినిమాని కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నోసెంట్ అబ్బాయి పాత్రలో, ప్రేమించిన అమ్మాయి ఎంత బాధ పెట్టినా భరించే పాత్రలో విజయ్ శంకర్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని బాగా చూపించింది. అమృతగా అనూహ్య సారిపల్లి, సైకియాట్రిస్ట్ పాత్రలో ప్రశాంత్ మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం పరవలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ రాజేష్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ ని బాగా రాసుకొని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాత మన్మధరావు సినిమాకు తగ్గట్టు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా పాగల్ వర్సెస్ కాదల్ రెండు ప్రేమ కథల మధ్య జరిగే ఒక కామెడీ లవ్ ఎంటర్టైనర్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు