×
Ad

సల్మాన్‌ ఖాన్‌ను ‘ఉగ్రవాది’గా ప్రకటించిన పాకిస్థాన్‌.. ఇప్పుడు ఏం జరుగుతుంది?

బలూచిస్థాన్‌, పాకిస్థాన్‌ పేర్లను సల్మాన్ వేర్వేరుగా ప్రస్తావించడంపై పాక్‌లో దుమారం చెలరేగింది.

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ ‘ఉగ్రవాది’గా ప్రకటించింది. “రియాద్‌ ఫోరం”కు సంబంధించిన ప్రోగ్రాంలో బలూచిస్థాన్‌పై సల్మాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని పాకిస్థాన్ అంటోంది.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నగరంలో ఈ అంతర్జాతీయ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. “రియాద్‌ ఫోరం”లో సినిమా, టూరిజం, టెక్నాలజీ, వినోదం, వ్యాపారం వంటి రంగాల ప్రముఖులు పాల్గొని సౌదీ విజన్‌ 2030 కింద దేశ అభివృద్ధి, ప్రపంచ భాగస్వామ్యాలపై మాట్లాడతారు.

బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల పాల్గొన్న జోయ్‌ ఫోరం 2025 కూడా అలాంటి కార్యక్రమమే. ఇది సౌదీ వినోద శాఖ నిర్వహించే వార్షిక గ్లోబల్‌ ఈవెంట్‌.

ఇందులో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. “ఇప్పుడే ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ విడుదల చేస్తే సూపర్‌హిట్‌ అవుతుంది. తమిళ, తెలుగు, మలయాళ సినిమాలు తీసినా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ అనేక దేశాల వాళ్లు పనిచేస్తున్నారు. బలూచిస్థాన్‌ వాళ్లు ఉన్నారు, అఫ్ఘానిస్థాన్‌ వాళ్లు ఉన్నారు, పాకిస్థాన్‌ వాళ్లు ఉన్నారు… అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు” అని అన్నారు.

Also Read: మొంథా తుపాను వేళ వారు ఇలా చేస్తున్నారు.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి: హోంమంత్రి అనిత

బలూచిస్థాన్‌, పాకిస్థాన్‌ను వేరుగా ప్రస్తావించడంపై పాక్‌లో దుమారం చెలరేగింది. పాకిస్థాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ భౌగోళిక సమగ్రతకు సవాలుగా సల్మాన్‌ వ్యాఖ్యలను భావించారు.

సల్మాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉగ్రవాద చట్టం (1997)లోని 4వ షెడ్యూల్‌లో చేర్చిందని తెలుస్తోంది. ఉగ్రవాద అనుమానితుల జాబితాలో ఉండే వారి కదలికల నియంత్రణ, న్యాయపరమైన చర్యలు వంటివి 4వ షెడ్యూల్‌లో ఉంటాయి. దీంతో సల్మాన్‌పై కఠిన పర్యవేక్షణ, కదలికల నియంత్రణ, చట్టపరమైన చర్యల అవకాశాలు ఉంటాయి.

ఈ విషయాన్ని 2025 అక్టోబర్‌ 16 తేదీన బలూచిస్థాన్‌ హోం డిపార్ట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అందులో సల్మాన్‌ను “ఆజాద్‌ బలూచిస్థాన్‌ ఫెసిలిటేటర్‌”గా పేర్కొన్నారు.

బలూచ్‌ ప్రజలు హ్యాపీ

బలూచ్‌ విభజనవాద నేతలు మాత్రం సల్మాన్‌ వ్యాఖ్యలను ప్రశంసించారు. బలూచ్‌ స్వాతంత్ర్య పోరాట నాయకుడు మీర్‌ యార్‌ మాట్లాడుతూ.. “సల్మాన్‌ మాటలు ఆరు కోట్ల బలూచ్‌ ప్రజల్లో సంతోషాన్ని నింపాయి. బలూచిస్థాన్‌ను వేరుగా గుర్తించి సల్మాన్‌ అనేక దేశాలు చేయలేని పనిని చేశారు” అని అన్నారు.

బలూచిస్థాన్‌ నేపథ్యం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం ఇస్తోంది. పాకిస్థాన్‌లో భూభాగపరంగా బలూచిస్థాన్ పెద్ద ప్రావిన్స్‌ అయినా, సహజ వనరులు ఉన్నా ఈ ప్రాంతం ఆర్థికంగా వెనుకబడి ఉంది. సుమారు 70 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటివరకు తన వ్యాఖ్యలపై అధికారిక ప్రకటన చేయలేదు.