పలాస 1978 – రివ్యూ
రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ‘‘పలాస 1978’’ రివ్యూ..

రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ‘‘పలాస 1978’’ రివ్యూ..
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించగా కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘పలాస 1978’ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొత్త సినిమా.. కొత్త నటీనటులు.. కొత్త టెక్నీషియన్స్.. అందరూ కొత్త వారితో అందరు మెచ్చేలా సినిమా చేయడం అంటే అది అంత సులువైన పని కాదు. కాని పలాస టీమ్ సినిమా రిలీజ్‌కు ముందే.. పెద్ద మెప్పు పొందారు. టీజర్స్ ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించారు. మరి సినిమా కూడా అదే విధంగా ఆడియన్స్ మెప్పు పొందిందా లేదా చూద్దాం.
కథ :
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని అంబుసోలి గ్రామంలో పద్యాల సుందర్ రావుకు రంగారావు, మోహన్ రావు ఇద్దరు కుమారులు. కుటుంబమంతా జానపద పాటలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అలరిస్తూ జీవిస్తుంటారు. పలాసలో పెద్దషావుకారు, చిన్నషావుకారు అన్నదమ్ములు. వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఇక్కడ రెండు వర్గాల మధ్య గొడవలో తారకేశుకుదెబ్బలు తగిలి కొద్దిరోజులు మంచానికే పరిమితమవుతాడు. కళ్లముందే కొడుకు మంచానికి పరిమితమవడంతో తట్టుకోలేని పెద్దషావుకారు సుందర్ రావు కొడుకులను చంపడానికి ప్లాన్ చేస్తాడు..
రంగారావు, మోహన్ రావు… షావుకారు పురమాయించిన బైరాగిని చంపేసి పెద్దషావుకారుకు ఎదురుతిరుగుతారు. అన్నను ఎదిరిరించిన రంగా, మోహన్‌లను చిన్నషావుకారు తన దగ్గర చేర్చుకుంటాడు. రాజకీయంగా లబ్ధి పొందుతాడు. అప్పుడే పలాసకు ఎన్నికలొస్తాయి. ఇంతలోనే పెద్దషావుకారు భార్య మరిదిని వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును మంచాన పడేసిన వాళ్లను వదిలిపెట్టొద్దని ప్రాధేయపడుతుంది. వదిన మాటలకు చలించిపోయిన చిన్నషావుకారు కిరాయిగుండాలతో రంగారావును అత్యంత కిరాతకంగా చంపిస్తాడు.
కళ్లముందే అన్న చనిపోవడంతో తట్టుకోలేని మోహన్ రావు… పెద్దషావుకారు, చిన్నషావుకారులను చంపాలనుకుంటాడు. ఓ రోజు మార్కెట్‌లో పెద్దషావుకారును మట్టుబెడతాడు. ఆ వార్త విన్న చిన్నషావుకారు రహస్యంగా జీవిస్తూ బైరాగి కొడుకుతో మోహన్ రావును చంపాలని ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్‌లో మోహన్ రావు భార్య లక్ష్మి చనిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సోదరుడు, భార్యను హత్య చేయించిన చిన్నషావుకారిని మోహన్ రావు ఏం చేశాడు? షావుకార్ల రాజకీయ కుట్రకు బలైన మోహన్ రావు చివరకు ఏమయ్యాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ కథ ఉత్తరాంధ్రలో జరిగిన ఒక ఊరి కథ. 1978లో జరిగిన కథ. ఇప్పటి జనాలకు ఎవరికి తెలియని కథగా పలాసను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు కరుణ కుమార్. రచయితగా తన అనుభవాన్నంతా రంగరించి మారుమూల పల్లెలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా అల్లుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా పాత్రలను, సన్నివేశాలను పేర్చుకుంటూవెళ్లాడు. పెద్దషావుకారు హత్య విచారణతో మొదలైన పలాస కథ.. అప్పటి పరిస్థితులకు తగినట్లుగా పాత్రల పరిచయం, పలాసలో జానపద కళాకారుల పరిస్థితి, అణగారిన వర్గాలపై షావుకార్ల పెత్తందారి వ్యవస్థను చూపిస్తూ వారిపై రంగా, మోహన్‌ల తిరుగుబాటు ఎలా మొదలైందో వివరిస్తూ సినిమాను ఇంటర్వెల్ వరకు తీసుకొచ్చాడు.
రాజకీయ కుట్రలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు, కుటుంబ కలహాలు, భావోద్వేగాలతో నడిపించి కథలో ప్రేక్షకుణ్ణి లీనం చేశాడు. ఎప్పుడైతే అన్న చనిపోతాడో అప్పటి నుంచి కథ కీలక మలుపు తిరుగుతుంది. ప్రతీకారంతో రగిలిపోయే మోహన్ రావు.. పలాసలో భయాన్ని పొగొట్టేందుకు పోలీసుల చర్యలు.. ఆ తర్వాత పరిణామాలను సినిమా వేగాన్నిపెంచాయి.
పోలీస్ స్టేషన్‌లో హీరో చెప్పే డైలాగ్స్ ప్రజల మధ్య నాడు ఎలాంటి అసమానతలున్నాయి, రాజకీయ చదరంగంలో అణగారిన వర్గాల ప్రజలు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో చెబుతూ పలాస స్టోరీని క్లైమాక్స్‌కు చేర్చాడు. కథ పరంగా పలాస సినిమా ‘రంగస్థలం’, ‘అసురన్’ సినిమాలను గుర్తు చేస్తుంది. డైరెక్టర్ తనదైన శైలిలో కథనాన్ని తీర్చిదిద్ది కొత్తదనాన్ని చూపించాడు. రంగా, మోహన్ రావులతో పాటు పెద్దషావుకారు, చిన్నషావుకారు పాత్రలు పలాస కథకు ప్రాణం పోశాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే : ఒక మంచి రా అప్పీల్‌తో కొత్తదనం ఫీల్ అయ్యే సినిమా ఇది. మంచి సినిమా అందించాలని పలాస టీమ్ నిజాయితీగా చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కాకాపోతే ఆ ప్రయత్నంలో చిన్న లోపాలు కనిపించాయి అంతే . కానీ మొదటి ప్రయత్నంలోనే మంచి సినిమాను అందించడంలో సక్సెస్ అయ్యారు. ఈ వీకెండ్‌లో చూడదగ్గ సినిమా ‘‘పలాస 1978’’. అంతే కాదు బాక్సాఫీద్ దగ్గర కూడా నెట్టుకురాగలదు ఈ మూవీ.
(ఓ పిట్ట కథ – రివ్యూ)