Past Indian Football Coach Syed Abdul Rahim Biopic Ajay Devgn Maidaan Movie Review and Rating
Maidaan Movie Review : మన దగ్గర స్పోర్ట్స్ డ్రామాలు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ చాలానే వచ్చాయి. ప్రేక్షకులు ఆ వ్యక్తికి లేదా ఆ ఆటలో ఉన్న ఎమోషన్ కి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఇప్పటికే చాలా మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ సక్సెస్ అయ్యాయి. ఈ ‘మైదాన్’ సినిమా కూడా అదే కోవకి చెందినది. 1950 – 1962 మధ్య ఇండియన్ ఫుట్ బాల్ టీం కథ, అప్పుడు ఉన్న ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా ఈ మైదాన్ సినిమాని తెరకెక్కించారు.
అజయ్ దేవగన్(Ajay Devgn), ప్రియమణి(Priyamani) ముఖ్య పాత్రల్లో అమిత్ శర్మ దర్శకత్వంలో బోనికపూర్, జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ మైదాన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎప్పుడో అయిదేళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది. ఇక ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి అప్పటి ఫుట్ బాల్ కి సంబంధించి బతికున్న వాళ్ళందర్నీ కలిసి కథ రెడీ చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా నేడు ఏప్రిల్ 10న హిందీలో మాత్రమే రిలీజయింది.
కథ విషయానికొస్తే..
1952 ఒలంపిక్స్ లో ఇండియన్ ఫుట్ బాల్ టీం దారుణమైన ప్రదర్శన చూపించి వెనుతిరిగి వస్తుంది. దీంతో దేశమంతా విమర్శలు వస్తాయి. అయితే ఫుట్ బాల్ టీం కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్(అజయ్ దేవగన్) ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు చెప్పి కనీసం మనకి షూస్ కూడా లేవు, నాకు కావాల్సినవి ఇచ్చి, నాకు నచ్చిన వాళ్ళని ప్లేయర్స్ గా సెలెక్ట్ చేసుకునే అధికారం ఇస్తే వచ్చే ఒలంపిక్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను అంటాడు. అప్పటి ఇండియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ అంజాన్ ఓకే చెప్తాడు. దీంతో కోచ్ రహీమ్ దేశమంతా ఉన్న ఫుట్ బాల్ క్లబ్స్ తిరిగి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన భార్య సైరా(ప్రియమణి),కొడుకు హకీమ్.. ఫ్యామిలీని కూడా వదిలేసి దూరంగా ఉంటాడు. హకీమ్ కూడా తండ్రి బాటలో ఫుట్ బాల్ బాటలోనే వెళ్తాడు.
అప్పట్లో కలకత్తాలోనే ఎక్కువ ఫుట్ బాల్ ప్లేయర్స్, టీమ్స్, మైదానాలు ఉండేవి. దీంతో కొంతమంది ఫుట్ బాల్ అంటే కలకత్తానే, మన చేతిలోంచి గేమ్ వెళ్ళకూడదు అని అధికారం కోసం ప్రయత్నిస్తుండగా రహీమ్ ఇండియా నలుమూలల నుంచి ఆటగాళ్ళని తీసుకురావడం కొంతమందికి నచ్చదు. ఇదే విషయం ఓ బిజినెస్ మెన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ రాయ్(గజరాజ్) రహీమ్ ని అవమానించేలా మాట్లాడితే రహీమ్ గట్టిగా సమాధానం చెప్తాడు. దీంతో అప్పట్నుంచి రహీమ్ పై రాయ్ పగ పెంచుకుంటాడు. ఇక 1956 ఒలంపిక్స్ లో ఎవరూ ఊహించలేనంతగా ఆడి ఇండియన్ టీం నాలుగో స్థానంలో నిలుస్తారు. తృటిలో కాంస్య పతకం మిస్ అవుతుంది. అయినా రహీమ్ పై బురద చల్లడానికి కొంతమంది ఫుట్ బాల్ ఫెడరేషన్ సభ్యులు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత 1960 ఒలంపిక్స్ లో బాగా ఆడినా గ్రూప్ సేజిలోనే వెనక్కి రావడంతో రాజకీయాలు చేసి రహీమ్ ని కోచ్ గా తప్పిస్తారు.
రహీమ్ కి అండగా ఉంటున్న ఫుట్ బాల్ ఫెడరేషన్ చైర్మన్ అంజాన్ ని కూడా రాయ్ తప్పించి తన మాట వినేవాళ్ళని పెట్టిస్తాడు. అదే సమయంలో రహీమ్ కి లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. దీంతో ఆటకి దూరమయి, ఆరోగ్యం బాగోలేక చావు కోసం ఎదురుచూస్తున్న రహీమ్ కి భార్య సైరా మోటివేషన్ ఇస్తుంది. కనీసం చచ్చేలోపు నీకు నచ్చింది చెయ్ అంటుంది. దీంతో అతను మళ్ళీ ఇండియన్ కోచ్ గా ఎలా మారాడు? 1962 లో ఇండియన్ ఫుట్ బాల్ టీంని ఏషియన్ గేమ్స్ లో విన్నర్ గా ఎలా నిలిపాడు ఈ క్రమంలో అతను ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి? రహీమ్ పై పగ పెంచుకున్న రాయ్ అతన్ని ఎలా అభిమానిస్తాడు? 1962 ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీంపై దాడి ఎందుకు జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
Also Read : Bheems Ceciroleo : టాలీవుడ్‌కి కొత్త కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడు.. ఇక దేవిశ్రీ, థమన్..
సినిమా విశ్లేషణ..
ఈ సినిమా బయోపిక్ కాబట్టి రహీమ్ వ్యక్తిగత జీవితం, అతని కోచ్ జీవితమే కాక అప్పటి ఇండియన్ ఫుట్ బాల్ టీం పరిస్థితుల గురించి బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కే మూడు ఒలంపిక్స్ చూపించడం, రహీమ్ ని కోచ్ గా తీసేయడం, అతనికి లంగ్ క్యాన్సర్ రావడంతో కథ అయిపోయింది అనిపిస్తుంది. దీంతో ఇంక సెకండ్ హాఫ్ ఏం చూపిస్తారు అనుకుంటారు. కానీ అసలు కథ సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. చివరి గంట 1962 ఏషియన్ గేమ్స్, మన ఫుట్ బాల్ టీం కథ, వాళ్ళ ఆట అద్భుతంగా చూపించి ప్రేక్షకులను ఎమోషన్ తో కట్టిపడేస్తారు.
ఫస్ట్ హాఫ్ లో సినిమా కొంచెం సేపు బోర్ కొడుతుంది. ఆట ఎమోషన్ తో పాటు, తండ్రి – కొడుకు, భర్త – భార్య ఎమోషన్ ని కూడా మైదాన్ సినిమాలో చూపించారు. ఫుట్ బాల్ ఆటని, అప్పటి కాలానికి తగ్గట్టు లొకేషన్స్, టెక్నాలజీ అన్ని చాలా బాగా చూపించారు. ఇప్పటివరకు ఫుట్ బాల్ పై వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఈ రేంజ్ కెమెరా షాట్స్ ఎవరూ వాడలేదని చెప్పొచ్చు. అయితే 1962 లో ఏషియన్ గేమ్స్ గెలిచి లంగ్ క్యాన్సర్ తో ఆ తర్వాతి సంవత్సరమే రహీమ్ చనిపోవడం విషాదకరం. రహీమ్ కోచ్ గా తప్పుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మన ఇండియన్ ఫుట్ బాల్ టీం ఒలంపిక్స్ కి అర్హత సాధించలేదు అంటే అతను ఎంత గొప్ప కోచ్, ఇండియన్ ఫుట్ బాల్ టీంని ఎంతలా మార్చాడో అర్ధమవుతుంది. అప్పుడు ఉన్న ప్రతికూల పరిస్థితులు, అతనిపై రాజకీయాలు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా ఇండియన్ ఫుట్ బాల్ చరిత్రలో కొన్ని మంచి రోజులు క్రియేట్ చేసాడు రహీమ్. వాటన్నిటిని ఈ మైదాన్ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించడం విశేషం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో జీవించేసాడని చెప్పొచ్చు. అతని భార్యగా ప్రియమణి తక్కువ సేపే కనిపించినా మెప్పించింది. ఇక అప్పటి ఇండియన్ ఫుట్ బాల్ టీంలో ఉన్న ప్లేయర్స్ కి తగ్గట్టు తీసుకొచ్చిన నటీనటులంతా ఫుట్ బాల్ నేర్చుకొని మరీ రియల్ ప్లేయర్స్ లాగా ఆడి అదరగొట్టారు. విలనీ షేడ్ లో రాయ్ పాత్రలో గజరాజ్ కూడా మెప్పిస్తారు.
Also Read : War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా.. నిజమేనా..!
సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకి పనిచేసిన ప్రతి క్రాఫ్ట్ చాలా పక్కాగా పనిచేసింది. కరోనా ముందు సినిమా మొదలుపెట్టినా కరోనాలో వేసిన సెట్స్ పాడవడం, మళ్ళీ ఖర్చుపెట్టడం.. ఇలా సినిమాకి బడ్జెట్ పెరిగినా అద్భుతంగా తీశారు. కెమెరా విజువల్స్ ఆ కాలానికి తగ్గట్టు చూపించారు. ఫుట్ బాల్ గేమ్ లో ప్రతి షాట్ చాలా కొత్తగా చూపించారు. కొన్ని కెమెరా షాట్స్ కి నిజంగా దగ్గరుండి ఫుట్ బాల్ గేమ్ చూస్తున్నామా అనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రతి సీన్ కి తగ్గట్టు చాలా బాగా ఇచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా పక్కాగా చేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా సెట్స్ ఆ కాలానికి తగ్గట్టు బాగా వేశారు. ఇక కథ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించారు. దర్శకుడిగా అమిత్ శర్మ వంద శాతం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
మొత్తంగా ‘మైదాన్’ సినిమాలో 1950 – 1962 మధ్యలో ఇండియన్ ఫుట్ బాల్ టీం చరిత్ర, అప్పటి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితకథని అద్భుతంగా చూపించారు. ప్రతి ఇండియన్, ఫుట్ బాల్ ఆటని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=tZMkLuvLfbg
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.