Pawan Kalyan
Bappi Lahiri : బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ లోనే కాక తెలుగు, తమిళ్, బెంగాలీ.. మరిన్ని భాషల్లో చాలా చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకి మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బప్పీ లహిరి మంగళవారం రాత్రి మరణించారు. బప్పీ లహరి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బప్పీ లహరి మృతిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ నోట్ లో.. ”శ్రీ బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. భారతీయ చలనచిత్ర సంగీత విభాగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వరకర్త శ్రీ బప్పీ లహరి కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. శ్రీ బప్పీ లహరి పాటలు హిందీ సంగీతప్రియులకు ఎంత చిరపరిచితమో, తెలుగునాట కూడా ఆయన స్వరపరచిన గీతాలు అంతే ప్రాచుర్యం పొందాయి. డిస్కో తరహా పాటలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు. డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా ఆజా..’ పాట నేటికీ రష్యాతో సహా తూర్పు ఐరోపా దేశాల్లో వినిపిస్తుంది.
అక్కడి పార్టీల్లో ఈ పాటకు యువత డ్యాన్స్ చేస్తుంటారు. డిస్కో డ్యాన్సర్ హీరో శ్రీ మిథున్ చక్రవర్తి ఆ దేశాలవాళ్ళకు పరిచయమయ్యారంటే అది శ్రీ బప్పీ లహరి బాణీ ప్రభావమే. గాయకుడిగానూ ఈతరంవాళ్ళను శ్రీ బప్పీ లహరి మెప్పించారు. తెలుగు చిత్రాలకు ఎన్నో చక్కటి గీతాలు ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. సినీ రంగంలో శ్రీ బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ బప్పీ లహరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ తెలిపారు.