Pawan Kalyan : తీవ్ర విషాదం.. పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. ఇటీవలే కలిసిన పవన్..
నేడు ఉదయం ఆ అభిమాని మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. (Pawan Kalyan)
- Saketh U
- Published on- July 8, 2026 / 07:17 AM IST
Pawan Kalyan
Pawan Kalyan : ఇటీవల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ ని పవన్ కళ్యాణ్ కలిసి అతని కోరిక తీర్చారు. నేడు ఉదయం ఆ అభిమాని మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ హనుమకొండ ప్రాంతానికి చెందిన పొనుగోటతి రాము, మానస దంపతుల కొడుకు నిరంజన్ చిన్నప్పట్నుంచి అరుదైన డ్యూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు.
ఈ వ్యాధితో నిరంజన్ తోపాటు అతని కుటుంబం తీవ్ర వేదన అనుభవిస్తోంది. కాలక్రమేణా కిడ్నీలు కూడా దెబ్బతినడంతో వరంగల్ తోపాటు పలు నగరాల్లోని ఆస్పత్రుల్లో నిరంజన్‌కు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో మూడేళ్లుగా నిరంజన్ మంచానికే పరిమితం అయ్యాడు. నిరంజన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ని కలవాలని ఉందని కోరాడు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని పవన్ వద్దకు తీసుకెళ్లడంతో ఇటీవల జూన్ 17న పవన్ కళ్యాణ్ హనుమకొండ వెళ్లి ఆ బాలుడిని కలిశారు.
Also Read : అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. స్వయంగా వెళ్లి.. ఫొటోలు వైరల్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ నివాసానికి వచ్చి ఆ బాలుడి కోరిక నెరవేర్చాడు. నిరంజన్‌ను ఆప్యాయంగా పలుకరించారు. అతనికి తిరుపతి ప్రసాదాన్ని అందించి, రూ.లక్ష ఆర్ధిక సహాయం అందజేశారు. తన అభిమాన హీరోను కలవడంతో నిరంజన్, అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ నేడు తెల్లవారుజామున మరణించాడు. దీంతో హనుమకొండ, పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. నిరంజన్ చివరి కోరిక పవన్ తీర్చారు అని అభిమానులు అంటున్నారు.
