Pawan Kalyan Serve Food to 96 Year Old Women from Pithapuram
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పవన్ కూడా అందర్నీ మంచిగా ఆదరిస్తారు. అయితే పవన్ ఓ బామ్మ చేసిన పనికి పొంగిపోయి ఆ బామ్మ అడిగిన కోరికను తీర్చాడు.
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ మీద అభిమానంతో ఆయన ఎన్నికల్లో గెలవాలని, గెలిస్తే వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకుంది. పవన్ గెలవడంతో పోతుల పేరంటాలు తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి రూ.27వేలతో గరగ చేయించి అమ్మవారికి సమర్పించారు.
అయితే ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలియడంతో పవన్ కళ్యాణ్ ఆమెని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆవిడతో కలిసి భోజనం చేసారు. పవన్ స్వయంగా ఆ వృద్ధురాలికి భోజనం వడ్డించారు. అనంతరం ఆమెకు చీర, లక్ష రూపాయల నగదును అందించారు పవన్. దీంతో పవన్ చేసిన పనికి మరోసారి పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది కదా పవన్ మంచితనం అని మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ వృద్ధురాలిని పిలిపించి భోజనం పెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.