Rakshana Review : పాయల్ రాజ్ పుత్ ‘రక్షణ’ మూవీ రివ్యూ.. పోలీసాఫీసర్ గా పాయల్ మెప్పించిందా?

రక్షణ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించింది.

Payal Rajput Rakshana Movie Review and Rating

Rakshana Movie Review : RX100 తో ఫేమ్ తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు ‘రక్షణ’ అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్.. పలువురు ముఖ్య పాత్రల్లో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన రక్షణ సినిమా నేడు జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు. రక్షణ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించింది. ట్రైలర్, టీజర్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పారు.

కథ విషయానికొస్తే.. కిరణ్(పాయల్ రాజ్ పుత్) ACP గా పనిచేస్తుంటుంది. రెండేళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆ సమయంలో లాలీపాప్ తింటూ ఓ ముసుగు వ్యక్తిని చూసి అది మర్డర్ అని అనుమానిస్తూ ఉంటుంది కిరణ్. పోలీస్ అయ్యాక దాని గురించి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆ ముసుగు వ్యక్తి ఎవరో దొరకరు. తను పోలీస్ అయ్యాక అరుణ్(మానస్) అమ్మాయిలని ఏడిపిస్తున్నాడని తెలిసి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అరుణ్ కిరణ్ పై పగ పెంచుకుంటాడు. ఓ రోజు కాల్ గర్ల్ యాప్ లో కిరణ్ ఫొటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తన నంబర్ ఉంటుంది. తనకు చాలా కాల్స్ రావడంతో కిరణ్ ఇది ఎవరు చేసారు అని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఈ క్రమంలో అరుణ్ సూసైడ్ చేసుకుంటాడు.

అరుణ్ చనిపోయేటప్పుడు ACP కిరణ్ వల్లే చనిపోయాను అని వీడియో రిలీజ్ చేస్తాడు. అయితే అది కూడా మర్డర్ అని భావిస్తుంది కిరణ్. కానీ పై అధికారులు కిరణ్ వల్లే ఓ వ్యక్తి చనిపోయాడని ఆమెని సస్పెండ్ చేస్తారు. అదే సమయంలో కొన్ని అమ్మాయిల యాక్సిడెంట్స్, సూసైడ్ కేసులు కూడా మర్డర్ కేసులు అని అనుమానిస్తూ ఉంటుంది కిరణ్. దీంతో సస్పెండ్ అయ్యాక వాటి గురించి రీసెర్చ్ చేస్తుంది. అసలు అరుణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అది నిజంగానే మర్డరా? ప్రియ చావుకి దీనికి సంబంధం ఉందా? కాల్ గర్ల్ వెబ్ సైట్ లో తన ఫేక్ ప్రొఫైల్ పెట్టింది ఎవరు? యాక్సిడెంట్స్, సూసైడ్స్ కి కిరణ్ కేసుకి సంబంధం ఏంటి? అందరూ అమ్మాయిలే అందుకు చనిపోతున్నారు? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Manamey Review : ‘మనమే’ మూవీ రివ్యూ.. అదిరిపోయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..

సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా కిరణ్ పోలీసాఫీసర్ గా కేసులు, అరుణ్ కేసు, ప్రియ చనిపోవడం, అరుణ్ చనిపోవడం.. ఇలా ఫాస్ట్ గానే సాగుతుంది. కిరణ్ ని సస్పెండ్ చేయడంతో ఇంటర్వెల్ ఇచ్చి సస్పెండ్ అయ్యాక కేసు ఎలా సాల్వ్ చేస్తుంది అనే ఆసక్తిని పెంచుతారు. సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ అన్ని కేసుల వెనక ఒకడే ఉన్నాడు వాడు ఎవడు అని రీసెర్చ్ చేయడంతోనే సరిపోతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ మరీ సాగతీతగా ఉంటుంది. చాలా సేపు కథ కదలకుండా ఒకే చోట రీసెర్చ్ లాగా చూపించడంతో బోర్ కొడుతుంది. అయితే అసలు పాయింట్ ఏంటి అని చెప్పకుండా చివరివరకు ఇన్వెస్టిగేషన్ తో సాగించడం ప్రేక్షకులకు కొంచెం అసహనం కలగక తప్పదు. మళ్ళీ సడెన్ గా క్లైమాక్స్ లో అన్ని వెంట వెంటనే రివీల్ చేస్తూ ముగింపు ఇస్తారు. పాయల్ పోలీసాఫీసర్ గా చేసినా ఓ రెండు యాక్షన్ సీన్స్ తప్ప మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ తోనే సాగుతుంది. అమ్మాయిలు, ఆడవాళ్ళకి సంబంధించి సొసైటీలో ఉన్న ఓ పాయింట్ ని సినిమాలో చక్కగా చూపించారు. కథ పరంగా ఓ కొత్త పాయింట్ నే తీసుకున్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. పాయల్ రాజ్ పుత్ ఇప్పటిదాకా అన్నీ కమర్షియల్, రొమాంటిక్ సినిమాల్లో నటించగా మొదటిసారి పోలీసాఫీసర్ గా మెప్పించిందనే చెప్పొచ్చు. బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఓకే అనిపించాడు. విలన్ పాత్రలో రోషన్ విలనిజం బాగానే పండించాడు. శివన్నారాయణ, ఆనంద్ రంగ.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒకటే టైటిల్ సాంగ్ ఉండగా అది పర్వాలేదనిపిస్తుంది. మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కొట్టినా కొన్ని చోట్ల మరీ ఓవర్ గా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల హారర్ సినిమాలకు ఇవ్వాల్సిన BGM థ్రిల్లర్ సినిమాకు ఇచ్చారు అనిపిస్తుంది. కథ కొత్తదే అయినా కథనం మాత్రం పాతదే. దర్శకుడిగా మరో వైపు నిర్మాతగా రెండు బాధ్యతలు చూసుకుంటూ ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

మొత్తంగా రక్షణ సినిమా మహిళలకు సంబంధించిన ఓ అంశంపై సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు