Kalki 2898AD : అమలాపురం నుంచి అమెరికా దాకా కల్కి ఫీవర్.. కల్కి సినిమా మొదలు నుంచి ఆసక్తికర విషయాలు ఇవే..

ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు కల్కి 2898AD గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

Prabhas Kalki 2898AD Movie Interesting Facts from Day 1 to Release Must Read

Kalki 2898AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమా రేపు జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు కల్కి 2898AD గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

ప్రాజెక్ట్ K.. కల్కి 2898AD..

ఫిబ్రవరి 2020లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థలో అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాణంలో ప్రభాస్ తో భారీ సినిమా ఉండబోతుందని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ K అని ప్రకటించి కలియుగం చివర్లో జరగబోయే కథ ఉంటుందని చెప్పి సినిమాపై ఆసక్తి కలిపించారు. టైటిల్ అనౌన్స్ చేసేముందు కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ K ని భారీగా ప్రమోట్ చేశారు. ఆ ఈవెంట్లో కల్కి 2898AD అనే టైటిల్ ప్రకటించి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.

ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారంటే..

అధికారికంగా కల్కి సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని, అన్నా బెన్, శోభన, రాజేంద్రప్రసాద్, సస్వత ఛటర్జీ, మాళవిక నాయర్, బ్రహ్మానందం నటిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్, రాజమౌళి.. కూడా ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. రేపు సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. వీరితో పాటు వేరే సినీ పరిశ్రమల నుంచి కూడా చాలా మంది నటీనటులు ఉన్నారని తెలుస్తుంది.

బడ్జెట్..

కల్కి సినిమాని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అందులో 100 కోట్లు ప్రభాస్ రెమ్యునరేషన్ అని, కమల్ హాసన్, అమితాబ్ లకు 10 కోట్ల పైన, దీపికాకు 5 కోట్ల పైన రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా భారీగా ఖర్చుపెట్టారు.

ట్రైలర్స్, సాంగ్స్..

ఇప్పటికే కల్కి సినిమా నుంచి ఓ గ్లింప్స్, రెండు పాటలు, రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమా గురించి బోలెడన్ని కథలు వినిపించాయి.

బుజ్జి..

కల్కి సినిమాలో ఓ చిన్న రోబో ఉంది. ప్రభాస్ భైరవ పాత్రకు ఈ రోబో పక్కనే ఉంది సపోర్ట్ చేస్తుంది. ఈ రోబో పాత్రకు బుజ్జి అనే పేరు పెట్టి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. అలాగే ఈ బుజ్జి భైరవ కలిసి ఓ స్పెషల్ వెహికల్ చేసినట్టు సినిమాలో చూపించారు. ఆ స్పెషల్ వెహికల్ ని గ్రాండ్ లాంచ్ ఈవెంట్ పెట్టి బయటకు తీసుకొచ్చారు. ఈవెంట్లో ప్రభాస్ స్వయంగా డ్రైవ్ చేసాడు. ఈ బుజ్జి వెహికల్ ని దేశంలోని పలు నగరాల్లో తిప్పి ప్రమోషన్స్ చేశారు. నాగచైతన్య, రిషబ్ శెట్టి, ఆనంద్ మహీంద్రా.. పలువురు సెలబ్రిటీలు ఈ బుజ్జి వెహికల్ ని డ్రైవ్ చేశారు. ఈ వెహికల్ ని దాదాపు 6 కోట్లతో మహీంద్రా కంపెనీ వాళ్ళు నాగ్ అశ్విన్ ఇచ్చిన ఐడియాతో తయారుచేశారు.

‘బుజ్జి అండ్ భైర‌వ’ యానిమేష‌న్ సిరీస్..

కల్కి సినిమాని పిల్లలకు దగ్గర చేయాలని రెండు ఎపిసోడ్స్ ఉన్న బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ని రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లో బుజ్జి, భైరవ పాత్రల గురించి చెప్పారు. ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ తో సినిమాలో కామెడీ కూడా ఉంటుందని అర్ధమయింది. అలాగే పిల్లలు ఈ సిరీస్ తో సినిమాకి కూడా కనెక్ట్ అయ్యేలా చేసారు.

కల్కి కథ..

నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం మహాభారతం చివర్లో కథ మొదలయి మళ్ళీ కలియుగం చివర్లో కథ అంతమవుతుంది. అలాగే మూడు ప్రపంచాల మధ్య ఈ కథ జరుగుతుంది. గంగానది ఒడ్డున ఉన్న కాశీ నగరం ప్రపంచంలో చివరి నగరంగా ఉంటుంది. భూమి మీద అన్ని వనరులు అంతరించిపోతాయి. కాశీలో కాంప్లెక్స్ మనుషులు అని కొంతమంది ప్రత్యేకంగా నిర్మించుకొని ఉంటారు. అక్కడ అన్ని దొరుకుతాయి. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లాలని భావిస్తూ ఉంటారు. కానీ కాంప్లెక్స్ మనుషులు వేరే మనుషులని రానివ్వరు. అక్కడికి వెళ్లాలంటే మిలియన్ యూనిట్స్(డబ్బుల లాంటివి) కావాలి. ఇలా కాంప్లెక్స్ ప్రపంచం, సాధారణ మనుషులు జీవించే కాశీ ప్రపంచంతో పాటు ఇంకో ప్రపంచం శంబాలా ఉంటుంది. పురాణాల ప్రకారం కల్కి ఈ నగరంలోనే పుడతాడు. కాంప్లెక్స్ లో డబ్బున్న మనుషులు, నిర్జీవంగా మారిన కాశీ మనుషులు, శరణార్థులు తల దాచుకునేలా శంబాలా నగరం.. ఇలా ఈ మూడు ప్రపంచాలను కలుపుతూ కథ ఉంటుంది అని ప్రమోషన్స్ లో తెలిపారు నాగ్ అశ్విన్. ఈ కథని మైథలాజి, సైన్స్ ని కలిపి సరికొత్తగా తెరకెక్కించారు.

Also Read : Kalki Collections : ‘కల్కి’ సినిమా ఓపెనింగ్ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావొచ్చంటే.. RRR రికార్డ్ బద్దలుకొడుతుందా?

ఏడుగురు చిరంజీవులు..

మన పురాణాల్లో వేద వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి లను చిరంజీవులు అంటారు. అంటే మరణం లేని వారు. ఈ ఏడుగురికి మరణం లేదని, కలియుగం చివరివరకు ఉంటారని, కలియుగం చివర్లో వస్తారని పురాణాల్లో ఉంది. అయితే నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమాలో ఈ ఏడుగురు చిరంజీవులు పాత్రలని చూపించబోతున్నట్టు కూడా టాక్ వచ్చింది. ఇప్పటికే అశ్వత్థామగా అమితాబ్ ని మూవీ యూనిట్ రివీల్ చేశారు. దీంతో మూవీలో మిగిలిన ఆరుగురు చిరంజీవులు కూడా ఉంటారని టాక్.

ప్రమోషన్స్..

కల్కి సినిమాకు ఎక్కువగా అవుట్ డోర్ ప్రమోషన్స్ చేయలేదు. సినిమా మీద ఎంత హైప్ తక్కువ ఉంటే అంత ఎక్కువ హిట్ అవుతుంది అనే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. అందుకే ఎక్కువ ప్రమోషన్స్ చేసి అంచనాలు పెంచకుండా సింపుల్ గా చేస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ లో వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులు, బుజ్జి వెహికల్ లాంచ్ ఈవెంట్, ముంబైలో ఓ ఈవెంట్, ఓ ఇంటర్వ్యూ పెట్టారు అంతే. అయితే ప్రమోషన్స్ తక్కువ చేసారని ప్రభాస్ అభిమానుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

థియేట్రికల్ బిజినెస్..

కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే మొత్తం 179 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా మొత్తం దాదాపు 380 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 385 కోట్ల షేర్ కలెక్షన్స్ అంటే 770 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావాలి. మూవీ యూనిట్ అయితే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దిగుతుంది

టికెట్ రేట్స్..

భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్లు పెంచాయి. తెలంగాణలో వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ కు 70 రూపాయలు, మల్టీప్లెక్స్ లకు 100 రూపాయలు వారం రోజుల పాటు పెంచుకోవచ్చు అని, బెనిఫిట్ షోకు 200 పెంచొచ్చు అని, అలాగే రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు పెంచుకోవచ్చు అని, అలాగే రోజుకు 5 ఆటలు వేసుకోవచ్చు అని, రిలీజ్ రోజు ఆరు ఆటలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఎదుగుదల ఆరంభం అయింది. అక్కడ్నుంచి పాన్ ఇండియా సినిమాలు వరుసగా వస్తునే ఉన్నాయి. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలతో పాటు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, జపాన్, మలేషియా, ఇంగ్లాండ్.. లాంటి దేశాల్లో తెలుగు సినిమాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్ లో తీస్తుండటంతో ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో వస్తుందా అని ఆశ్చర్యపోతూనే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక దేశంలోని అన్ని సినీ పరిశ్రమలలోని ప్రముఖులు కల్కి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ తాము కూడా ఎదురుచూస్తున్నామంటూ చెప్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ రేంజ్ సినిమా కలలో కూడా వస్తుందని ఊహించలేదు అని సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా, ప్రభాస్ కల్కి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండనున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపారు.