The Raja Saab Review
The Raja Saab Review : ప్రభాస్ మొదటిసారి చేసిన హారర్ ఫాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్.. హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, విటివి గణేష్, సత్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రాజాసాబ్ సినిమా నేడు జనవరి 9న రిలీజ్ అయింది.(The Raja Saab Review)
రాజు(ప్రభాస్) తన నానమ్మ గంగమ్మ(జరీనా వాహబ్)తో కలిసి జీవిస్తూ ఉంటాడు. గంగమ్మ ఒకప్పుడు తాను జమీందార్ వంశం అని, రాణి అని చెప్తూ ఉంటుంది. తనని యుక్త వయసులో వదిలేసి వెళ్లిన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి, కలవాలి అనుకుంటుంది. అనుకోకుండా ఒక ఫొటోలో కనకరాజు కనిపిస్తాడు. దీంతో రాజు నానమ్మ కోరిక నెరవేర్చడానికి బయలుదేరుతాడు.
ఈ క్రమంలో బెస్సి(నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. భైరవి(మాళవిక మోహనన్) పరిచయంతో వాళ్ళ తాత గురించి క్లూ దొరకడం జరుగుతుంది. దీంతో రాజు, భైరవి మరికొంతమంది ఓ అడవిలో ఉన్న పాత కోటకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక తన తాత డబ్బు మీద ఆశతో చనిపోయి దయ్యం అయ్యాడని తెలుస్తుంది. మరి తాత కనకరాజు వీళ్ళను ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? రాజు నానమ్మ కోరిక నెరవేర్చడా? అసలు గంగమ్మ – కనకరాజు రాజుల కాలం నాటి కథేంటి? కనకరాజు ఎందుకు గంగమ్మని వదిలేసి వెళ్ళాడు? భైరవి ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : The Raja saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ కామెడీ యాంగిల్ ఎలా ఉందంటే?
ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ సినిమా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇదేదో కొత్తగా ఉండబోతుంది అని అంతా అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో కాస్త బోరింగ్ గా సహజత్వం లేని సీన్స్ తో సాగుతుంది. ఓ పాట ఓ ఫైట్ ఓ సీన్ అన్నట్టు సింపుల్ సీన్స్ తో నడుస్తుంది. మధ్యమధ్యలో ఏదో ఉంది ఫ్లాష్ బ్యాక్, దయ్యం చాలా పవర్ ఫుల్ అన్నట్టు హైప్ ఇస్తూ నడిపించారు. రాజు, మరికొంతమంది కనకరాజు కోటలోకి వెళ్లడం అక్కడ తాత దయ్యం అయి వీళ్ళకు కనపడటంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని సెకండ్ హాఫె మీద ఆసక్తి నెలకొల్పారు.
ఇక సెకండ్ హాఫ్ మాత్రం బాగా రాసుకున్నారు. ఇది హారర్ ఫాంటసీ సినిమా అని చెప్పారు కానీ రాజాసాబ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. సెకండ్ హాఫ్ లో కాస్త భయపెడుతూ, ఇద్దరు హీరోయిన్స్ మధ ప్రభాస్ నలిగిపోతుంటే కామెడీతో, తాత ఆడే మైండ్ గేమ్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా కథ పరిగెడుతుంది. క్లైమాక్స్ లో ప్రభాస్ – సంజయ్ దత్ మధ్య సీన్స్ అయితే హైలెట్. అవన్నీ మైండ్ గేమ్ తో స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు.
అయితే ఈ మైండ్ గేమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సీన్స్ సాధారణ ప్రేక్షకులకు అర్దమవడం కాస్త కష్టమే. ఫ్లాష్ బ్యాక్ కనకరాజు – గంగమ్మ కథ కూడా ఆసక్తిగా ఉంటుంది. ఇక ట్రైలర్, టీజర్ లో చూపించిన కొన్ని సీన్స్ సినిమాలో లేకపోవడం గమనార్హం. ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో చెప్పిన డైలాగ్ కి, ఆ గెటప్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమాలో ఆ సీన్ కి అవకాశం ఉన్నా ఎడిటింగ్ లో తీసేసారు. సెకండ్ హాఫ్ కథ అంతా ఒక కోటలోనే జరగడం గమనార్హం.
హిప్నాటిజం, సహస్ర చక్రాలు అనే కాన్సెప్ట్ లతో పాటు తాంత్రిక శక్తులు, మనిషి అత్యాశ, బంధాల మీద మనిషి ప్రేమ.. వంటి అంశాలతో బాగానే రాసుకున్నారు. సింపుల్ గా మొదలై అక్కడక్కడా భయపెడుతూ కొన్ని చోట్ల నవ్విస్తూ మైండ్ తో గేమ్స్ ఆడుతూ నడుస్తుంది రాజాసాబ్. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. ట్రైలర్ లో చూపించిన జోకర్ గెటప్ కూడా సినిమాలో లేకుండా క్లైమాక్స్ లో పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చారు.
ప్రభాస్ చాలా కాలం తర్వాత రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ లో బాగా మెప్పించాడు. క్లైమాక్స్ లో నానమ్మ కోసం తపన పడే ఎమోషనల్ సీన్స్ లో అయితే ప్రభాస్ అదరగొట్టేసాడు. మాళవిక మోహనన్ రొమాంటిక్ సీన్స్ తో పాటు యాక్షన్ కూడా అదరగొట్టింది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అక్కడక్కడా కనిపించి పాటలు, కొన్ని సీన్స్ వరకు పరిమితం అయ్యారు. తాత పాత్రలో సంజయ్ దత్ కూడా చాలా బాగా నటించారు.
విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య బాగానే నవ్వించారు. బొమన్ ఇరానీ ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. హీరోయిన్ ఆనంది తళుక్కున మెరిసింది. నానమ్మ పాత్రలో జరీనా వాహబ్ మంచి ఎమోషన్ ని పండించారు. జరీనా వాహబ్ యంగ్ పాత్రలో తమిళ నటి అమ్ము అభిరామి చాలా బాగా నటించింది. సముద్రఖని ఓ కీలక పాత్రలో మెప్పించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Jana Nayagan: ‘జన నాయగన్’ రిలీజ్ కు లైన్ క్లియర్.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఆదేశాలు
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం యావరేజ్. హిందీ రీమిక్స్ సాంగ్ నాచే నాచే.. విజువల్ పరంగా, వినడానికి ఫ్యాన్స్ కి మంచి హైప్ ఇస్తుంది. లొకేషన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో అన్ని సెట్స్ వేసి చేసారని చాలా క్లియర్ గా తెలుస్తుంది. వాటిల్లో సహజత్వం లేదు. రాజుల కాలం కథ లొకేషన్స్, సెకండ్ హాఫ్ కోట మాత్రం బాగా డిజైన్ చేసారు.
ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీన్స్ ని కట్ చేయొచ్చు. ట్రైలర్ లో చూపించిన తాత గెటప్ సీన్ ఉంచితే బాగుండేది. కొత్త కథ తీసుకొని హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ గా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు మారుతి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కోసం మారుతి బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. VFX విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ పరంగా మాత్రం చాలానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘ది రాజాసాబ్’ సినిమా ప్రభాస్ నుంచి ఊహించని హారర్ టచ్ ఇస్తూ తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్. కాస్త మైండ్ పెట్టి చూడాల్సిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.