నటి ప్రత్యూష బెనర్జీకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న తండ్రి శంకర్ బెనర్జీ..
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా తన కూతురికి శ్రద్ధాంజలి ఘటించలేకపోయానని ఓ తండ్రి పడిన ఆవేదన పలువురి మనసుల్ని తాకింది. వివరాళ్లోకి వెళ్తే.. ‘బాలికా వధు’(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో ఆనందిగా ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రత్యూష బెనర్జీ మరణించి నాలుగు ఏళ్లు అవుతుంది. ప్రత్యూష 2016 ఏప్రిల్1న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె శ్రద్ధాంజలి సందర్భంగా ఆమె చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలనుకున్న తండ్రికి లాక్‌డౌన్ కారణంగా నిరాశే ఎదురైంది.
రోజంతా తిరిగినా తనకు పూలదండ దొరకలేదని ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం తన కూతురి శ్రద్ధాంజలికి పూలమాల వేసి నివాళులు అర్పించేవాడినని, ఈసారి లాక్‌డౌన్ సందర్భంగా పరిస్థితులు మారాయని స్థానిక మీడియాతో మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారాయన. చివరికి తనే కొన్ని పువ్వులను తీసుకొని పూలదండ సిద్ధం చేసి ప్రత్యూషకు నివాళులు అర్పించినట్లు చెప్పుకొచ్చారు.
‘బాలికా వధు’ సీరియల్‌లో ప్రత్యూషకు భర్తగా నటించిన సహనటుడు శశాంక్ వ్యాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నాడు. “మనం ఇష్టపడే వాళ్లు భౌతికంగా దూరమైనా ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. కనిపించకపోయినా మనల్ని గమనిస్తూ ఎప్పుడూ మనపై ప్రేమను కురిపిస్తారు” అంటూ మెసేజ్ పోస్ట్ చేసాడు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.