సేవ్ నల్లమల : సమంతా మద్దతు 

  • Publish Date - September 13, 2019 / 08:57 AM IST

న‌ల్ల‌మ‌ల అడ‌వుల‌లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌నుకున్న యురేనియం త‌వ్వ‌కాల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతుంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం విధ్వంసమవుతుందని ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలనే నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం..ప్రకృతి వైపరీత్యాలు..ముంచెత్తుతున్న వరదలు..గుక్కెడు తాగునీటికి  కూడా మైళ్లకొద్దీ వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందనీ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే ఈ ప్రమాదం మరింతగా పెరుగుతుందని టాలీవుడ్ గళమెత్తింది. పర్యవారణం విధ్వంసం అవడమే కాకుండా ప్రజారోగ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని మేధావులు, సామాన్యప్రజలు సైతం తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. 

సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు నినదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖులు ట్విట్టర్ లో తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ సమంతా కూడా తన మద్దతును ట్విట్టర్ ద్వారా తెలిపారు. సహజంగానే ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికురాలు అయిన  స‌మంత‌.. యురేనియం త‌వ్వ‌కాల నుండి న‌ల్ల‌మ‌ల అడ‌విని కాపాడండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరింది. నల్లమల ఫారెస్ట్ లో యురేనియం త‌వ్వకాల‌కి వ్య‌తిరేకంగా వేసిన పిటీష‌న్‌లో తాను కూడా సంత‌కం చేశాననీ..మ‌రి మీరూ..అంటూ నెటిజన్స్‌ని ప్ర‌శ్నించింది.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విజయ్ దేవరకొండ, సాయి ధ‌ర‌మ్ తేజ్, అన‌సూయ వంటి సిని సెల‌బ్రిటీలు నల్లమల అడవులను కాపాడుకోవాల్సి అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉందనీ..పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. గోరేటి వెంకన్న, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, చంద్ర సిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, గాయత్రీ గుప్తా, ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వంటి పలువురు మద్ధతునిచ్చారు. గిరిజనులు, ఆదివాసీలు, చెంచులు వంటి పలు అటవీ జాతులకు సంబంధించిన వారు అటవులనే నమ్ముకుని జీవిస్తుంటారనీ..ఇప్పటికే అంతరించిపోతున్నాయనీ వాపోతున్న పెద్ద పులల ఆవాసాలైన నల్లమలో తవ్వకాలో మరింత ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.