Producer Bunny Vasu visited Sri Tej in Kims Hospital
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యం కుదుటపడడంతో బన్నీవాసు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కాగా.. శ్రీతేజ్‌కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే.. అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని ఆయన చెప్పినట్లుగా సమాచారం.
డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే బాలుడిని అల్లుఅర్జున్, నిర్మాత దిల్‌రాజు, అల్లు అరవింద్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.
పుష్ప 2 చిత్ర బృందం రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, నిర్మాతలు రూ.50లక్షలు ల చొప్పున మొత్తం రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో బన్నీ వాసు శ్రీతేజ్‌ను పరామర్శించారు. విదేశాలకు తీసుకువెళ్లి చికిత్స అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.