నందమూరి బాలకృష్ణ ఆపరేషన్ అనంతరం క్యాన్సర్ బాధితురాలు స్వప్నను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు..
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆపరేషన్ అనంతరం క్యాన్సర్ బాధితురాలు స్వప్నను పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం అనంతపురం సోమనాథ్ నగర్‌కు చెందిన పేద విద్యార్థిని స్వప్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోందని, చికిత్సకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని అభిమానుల ద్వారా తెలుసుకున్న బాలయ్య స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకు రావాలని అభిమానులకు పిలుపు నివ్వగా.. అనంతపురం నుండి కొందరు అభిమానులు దగ్గరుండి స్వప్నను, ఆమె కుటుంబ సభ్యులను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
బాలయ్య స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్వప్నను పలకరించి ధైర్యం చెప్పారు. స్వప్నకు, ఆమె కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసానిచ్చారు. స్వప్న చికిత్సకు అవసరమైన ఖర్చును పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు.. తాజాగా బాలయ్య మరోసారి హాస్పిటల్‌కి వెళ్లి స్వప్నను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య, స్వప్నను పరామర్శిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘మా బాలయ్య మాట ఇవ్వడు, ఇస్తే మరువడు’ అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ‘పేదరికంతో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తనకు బాలకృష్ణ గారి చోరవతో జీవితంపై మళ్లీ ఆశలు చిగురించాయని, వైద్యులు, సిబ్బంది తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని’ స్వప్న సంతోషంగా చెప్పింది. బాలయ్య మంచి మనసుకు స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.