Rakul Preet
Tollywood Drugs case : టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ రేపే ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ రేపే విచారణకు రమ్మని కోరింది. రేపు ఉదయం 10.30 గంటలకు రకుల్ ఈడీ ముందుకు రానున్నారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ ని సెప్టెంబర్ 6న విచారణ కు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వడంఫై రకుల్ ప్రీత్ సింగ్ ఈడీకి లేఖ రాసింది. అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ అధికారులను కోరింది. విచారణకు తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని ఈడీ అధికారులను విన్నవించుకున్నారు. రకుల్ రిక్వెస్ట్ ని ఈడీ అధికారులు రిజెక్ట్ చేశారు. రేపే విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అకాశాలున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. సుమారు 8 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్‌లో కెల్విన్ చాటింగ్ వివరాలపై కూపీ లాగారు. కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన ఛార్మి.. అతని నెంబర్‌ను దాదా పేరుతో ఎందుకు ఫీడ్ చేసుకున్నారన్న అంశంపై ఈడీ ఆరా తీసింది. దాదా పేరుతో జరిపిన లావాదేవీలపైనా ఛార్మిని అధికారులు ప్రశ్నించారు. ఇక ఉదయం సెషన్‌లో ఛార్మిని విచారించిన ఈడీ.. ఛార్మి రెండు బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను పరిశీలించింది. అలాగే ఛార్మి, పూరీ బ్యానర్ల ఆర్థిక లావాదేవీలనూ సైతం ఈడీ అధికారులు పరిశీలించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు తన నుంచి ఎప్పుడూ పూర్తి సహకారం ఉంటుందన్నారు నటి ఛార్మి. ఈడీ తనను కొన్ని డాక్యుమెంట్లు సమర్పించమని కోరిందన్నారు. దీంతో తాను అన్ని పత్రాలను సమర్పించానని చెప్పింది. ఇంతకుమించి తాను మాట్లాడ కూడదన్నారు. అది చట్టానికి వ్యతిరేకం అవుతుందని చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. ఈడీ ఎదుట అప్రూవర్‌గా మారిన కెల్విన్.. డ్రగ్స్ సరఫరాపై ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మిని ప్రశ్నించారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో పాటు.. ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మరోవైపు జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మి టైటిల్ పాత్ర పోషించిన తర్వాత వెండితెర మీద మళ్లీ కనిపించలేదు. కథానాయికగా సినిమాలకు స్వస్తి పలికిన ఛార్మి.. పూరీ జగన్నాథ్‌కి సంబంధించిన పూరీ కనెక్ట్స్‌ను ఛార్మీ దగ్గరుండి చూసుకుంది. ఆ బ్యానర్‌లో ఛార్మి వరుసగా సినిమాలు నిర్మించారు. అలాగే పూరి జగన్నాథ్ స్వంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా ఛార్మినే పర్యవేక్షిస్తుంటారు. ఇక పూరీ కనెక్ట్స్ నుంచి 2018లో మెహబూబా.. 2019లో ఇస్మార్ట్ శంకర్‌లున్నాయి. ప్రస్తుతం విజయ దేవరకొండతో పాన్ ఇండియా లైగర్ సినిమాతో పాటు పూరీ కుమారుడు ఆకాశ్‌తో రొమాంటిక్ సినిమా చేస్తున్నారు. వీటిలో ఇస్మార్ట్ శంకర్ మూవీ వీరికి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక వీరిద్దరూ కలిసి ఆన్‌లైన్ క్లాత్ వ్యాపారాన్ని కూడా నడుపుతున్నారు.
వీరిద్దరి మధ్య బలమైన వ్యాపార సంబంధాలుండడంతో ఈడీ ఫోకస్ ప్రత్యేకంగా వీరిపైనే ఉంది. ఇది వరకే పూరి జగన్నాథ్ తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సమర్పించారు. ఇప్పుడు ఛార్మి నుంచి కూడా అధికారులు కీలక డాక్యుమెంట్లను తీసుకున్నారు. 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఛార్మి ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్నారు. ఇక సినీ తారల విచారణతో ఈడీ కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా విచారణకు హాజరుకావడంతో.. ఎలాంటి గందరగోళ పరిస్థితులకు పోలీస్ భద్రత కావాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో ఈడీ కోరిక మేరకు కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.