Double Ismart : ‘డబల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ మెప్పించిందా?

'డబల్ ఇస్మార్ట్' సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు పర్ఫెక్ట్ సీక్వెల్ గా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Review

Double Ismart : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్, కావ్య థాపర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘డబల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాధ్, చార్మీ నిర్మాణంలో ఇస్మార్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా ఈ డబల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. బాలీవుడ్స్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. డబల్ ఇస్మార్ట్ సినిమా నేడు ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ చిన్నప్పటి గతం, వాళ్ళ అమ్మ పోచమ్మ(ఝాన్సీ), వాళ్ళ అమ్మని చంపిన జ్ఞాపకాలతో మొదలవుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం వాళ్ల అమ్మని చంపిన వ్యక్తిని వెతుకుతూ ఇస్మార్ట్ శంకర్ అతని బిజినెస్, డబ్బులు టార్గెట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మని చంపింది బిగ్ బుల్(సంజయ్ దత్) అని తెలిసి అతని కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ మధ్యలో జన్నత్(కావ్య థాపర్) పరిచయం అవడంతో ఆమెతో ప్రేమలో పడతాడు.

ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్స్ మాఫియా డాన్, ఇల్లీగల్ బిజినెస్ లు చేస్తున్న బిగ్ బుల్ కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తెలియడంతో మెమరీ ట్రాన్స్ఫర్ ద్వారా తాను చనిపోయినా తన ఆలోచనలు, జ్ఞాపకాలు ఉంచి ఎప్పటికి బతికేలా ఉండాలని అనుకుంటాడు. మెమరీ ట్రాన్స్ఫర్ కోసం మనుషుల్ని వెతుకుతుంటే ఇస్మార్ట్ శంకర్ గురించి తెలుస్తుంది. ఆల్రెడీ గతంలో అతనికి మెమరీ ట్రాన్స్ఫర్ చేసారని తెలిసి మళ్ళీ అతన్నే పట్టుకుని అతని బ్రెయిన్ లోకి బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓ పక్క ఇండియన్ రా ఆఫీసర్స్ బిగ్ బుల్ కోసం వెతుకుతుంటారు. బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ఫర్ కోసం ఇండియాకు వచ్చి అతని మెమరీ ఇస్మార్ట్ శంకర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇస్మార్ట్ శంకర్ తన జ్ఞాపకాలని మర్చిపోయాడా? బిగ్ బుల్ మెమరీ ఇస్మార్ట్ శంకర్ లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిందా? రా ఆఫీసర్స్ బిగ్ బుల్ ని పట్టుకున్నారా? ఇస్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మని చంపిన బిగ్ బుల్ ని చంపాడా? మధ్యలో జన్నత్ తో ప్రేమ ఏమైంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : MR Bachchan : ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌..! ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?

సినిమా విశ్లేషణ.. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ లో శంకర్ ఫ్లాష్ బ్యాక్ చూపించక పోయినా ఇందులో శంకర్ చిన్నతనం చూపించి వాళ్ళ అమ్మని చంపిన వ్యక్తిని పగ తీర్చుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఫస్టాఫ్ అంతా ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలివేషన్స్, హీరోయిన్ తో సీన్స్, బిగ్ బుల్ కి చెందిన డబ్బులు దొంగతనాలు చేయడం చూపిస్తారు. ఇంటర్వెల్ సమయానికి మెమరీ ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొల్పుతారు.

తన మెమరీ ఇస్మార్ట్ శంకర్ లో ఉండిపోవడం, శంకర్ తప్పించుకోవడం, శంకర్ మాటిమాటికి బిగ్ బుల్ లాగా మారడంతో పాటు బిగ్ బుల్ కోసం రా ఆఫీసర్స్ వెతకడం అంటూ టామ్ & జెర్రీలా సాగుతుంది. ఇస్మార్ట్ శంకర్ లాగే ఈ సినిమా కూడా పూర్తిగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ లో అదే మాస్ డైలాగ్ డెలివరీతో తీశారు. స్టార్టింగ్ అమ్మ సెంటిమెంట్ కొంచెం బోర్ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ బాగానే సాగిన సెకండాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే నటి పవిత్ర అమ్మ సెంటిమెంట్ అయితే మరీ క్రింజ్ లా అనిపిస్తుంది. బి, సి సెంటర్స్ లో మాత్రం మాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చొచ్చు.

నటీనటుల పర్ఫామెన్స్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తను టైటిల్ తగ్గట్టు తన సినిమాల్లో తన ఎనర్జీని చూపిస్తూనే ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్ లాగే ఈ సినిమాలో కూడా ఫుల్ ఎనర్జీగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అబ్బాయిగా, పర్ఫెక్ట్ హైదరాబాదీ లాంగ్వేజ్ లో అదరగొట్టేసాడు. కావ్య థాపర్ ఓ పక్క అందంగా కనిపిస్తూనే మరోపక్క యాక్షన్ సీక్వెన్స్ లో కూడా మెప్పించింది. నెగిటివ్ రోల్ లో బిగ్ బుల్ గా సంజయ్ దత్ బాగా చేశాడు. చిన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తల్లిగా ఝాన్సీ ఎమోషన్ పాత్రలో పర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్ ఫ్రెండ్ గా గెటప్ శ్రీనుకి ఫస్ట్ పార్ట్ లో కంటే తక్కువ పాత్ర పడింది. ప్రగతి, షాయాజీ షిండే.. మిగిలిన నటినటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. మణిశర్మ అదిరిపోయే మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు మాస్ సాంగ్స్ ఇచ్చాడు. కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేశారు. కథపరంగా మళ్లీ ఇస్మార్ట్ శంకర్ లాగే అనిపించిన అదే వైబ్ తీసుకొస్తూ కొంచెం కొత్త కథనంతో చూపించారు. సినిమాలో పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ ఫర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకి పూరి జగన్నాథ్, ఛార్మి బాగానే ఖర్చుపెట్టినట్లు తెరపై తెలుస్తుంది.

మొత్తంగా ‘డబల్ ఇస్మార్ట్’ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు పర్ఫెక్ట్ సీక్వెల్ గా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక: ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు