Ramayanam Serial fame Dipika Chikhlia comments on Adipurush Movie
Adipurush : ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. రామాయణం(Ramayanam) అని చెప్పి ప్రమోట్ చేసి, సినిమాలో రామాయణం పాత్రల స్వరూపాలు మార్చేయడం, ట్రోల్స్ రావడంతో అసలు ఇది రామాయణం కాదని చెప్పడం, సినిమాలో వాడిన డైలాగ్స్ తో వివాదం, పలు చోట్ల సినిమాని బ్యాన్ చేయడం, సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు.. ఇలా ఆదిపురుష్ సినిమా పూర్తిగా వివాదాల్లో నిలిచింది.
ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్స్ రోజుకొకరు వచ్చి ఆదిపురుష్ ని విమర్శిస్తున్నారు. గతంలో బాలీవుడ్ లో రామానంద్ సాగర్ దర్శకత్వంలో రామాయణం సీరియల్ తెరకెక్కింది. ఇప్పటికీ ఈ సీరియల్ కి అభిమానులు ఉన్నారు. ఇందులో మన రామాయణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఆ రామాయణం సీరియల్ లో నటించిన పలువురు నటులు ఇప్పుడు ఆదిపురుష్ పై మండిపడుతున్నారు.
తాజాగా ఆ రామాయణం సీరియల్ లో సీత పాత్ర పోషించిన దీపికా చిక్లియా తాజాగా ఆదిపురుష్ వివాదంపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో దీపికా మాట్లాడుతూ.. నేను ఆదిపురుష్ సినిమా గురించి కామెంట్స్ చేయదలుచుకోలేదు. రామాయణం మన వారసత్వం. మన పురాణాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఇకనైనా ఆపేయాలి. రామాయణం చేసిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరిని నొప్పించకూడదు. రామాయణం వినోదానికి సంబంధించింది కాదు. మన విశ్వాసాలను మనం గౌరవించుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు రామాయణాన్ని తప్పనిసరిగా బోధించాలి అని వ్యాఖ్యానించారు.