Raakaasa Review : ‘రాకాస’ మూవీ రివ్యూ.. హిలేరియస్ హారర్ కామెడీ.. పడీ పడీ నవ్వాల్సిందే..
నిహారిక నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు, సిరీస్ లు అంటే హిట్ అని, మంచి కంటెంట్ అనే పేరు తెచ్చుకుంది. (Raakaasa)
- Saketh U
- Published On : April 3, 2026 / 01:50 PM IST
Raakaasa Review
Raakaasa Movie Review : సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కిన సినిమా ‘రాకాస’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాకాస సినిమా నేడు ఏప్రిల్ 3న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
రాకవరం అనే ఊళ్ళో కొన్ని వేల ఏళ్ళ నుంచి ఊరి అవతల ఒక కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అతను కొన్ని వందల ఏళ్ళకొకసారి హెచ్చరికలు పంపినప్పుడల్లా కొంత ఫుడ్, ఒక మనిషిని ఆహారంగా కోట లోపలికి ఆ ఊరివాళ్ళు పంపాలి. కోట వైపుకి ఎవరూ వెళ్ళకూడదు అని కఠిన నిబంధన ఉంటుంది. 500 ఏళ్ళ క్రితం ఆ ఊరి రాజు కోటలోని రాక్షసుడిని చంపడానికి వెళ్తాడు.
2026లో ఆ ఊరికి చెందిన ఈరబాబు(సంగీత్ శోభన్) అమెరికా నుంచి తను ప్రేమించిన అమ్మాయి సుకన్య(రాధ్య) కోసం వస్తాడు. కానీ సుకన్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అదే సమయంలో సుబ్బలక్ష్మి(నయన్ సారిక) ఈరబాబుకి దగ్గరవుతుంది. ఈరబాబు సోము(వెన్నెల కిషోర్)ని చంపాడని, అతను కోట దగ్గరకు వెళ్లాడని ఆరోపణలతో ఈరబాబుకి పంచాయితీ పెద్దలు శిక్ష వేస్తారు. అదే సమయంలో ఊరి కోట నుంచి హెచ్చరికలు రావడంతో ఓ తాతని కోటలోని రాక్షసుడికి బలి ఇవ్వడానికి పంపాలని ఊరిపెద్దలు నిర్ణయిస్తారు. ఆ తాతతో ఈరబాబుకి పని ఉండటంతో దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తూ అనుకోకుండా తాను వెళ్లాల్సి వస్తుంది. మరి ఈరబాబు ఆ కోట లోపలి వెళ్లాడా? అసలు కోట లోపల ఉన్న బ్రహ్మ రాక్షసుడి కథేంటి? ఈరబాబు – సుబ్బలక్ష్మి ప్రేమకథ ఏమవుతుంది? 500 ఏళ్ళ క్రితం కోట లోపలికి వెళ్లిన రాజు ఏం చేసాడు.. ఆ ఊరికి, కోటకు ఉన్న సంబంధం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Biker Movie Review: ‘బైకర్’ మూవీ రివ్యూ.. బైక్ రేసింగ్ అదిరిందిగా..
సినిమా విశ్లేషణ..
నిహారిక నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు, సిరీస్ లు అంటే హిట్ అని, మంచి కంటెంట్ అనే పేరు తెచ్చుకుంది. ఇక సంగీత్ శోభన్ సినిమాలంటే ఫుల్ నవ్విస్తాడు. వీరిద్దరి కాంబోతో పాటు వరుస హిట్స్ కొడుతున్న నయన్ సారిక ఉండటం, హారర్ కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ హాఫ్ మొదట్లో ఆ కోట, బ్రహ్మరాక్షసుడు కథ సగం చెప్పి దానిపై ఆసక్తి కలిగిస్తారు. ఇక ప్రస్తుతం ఈరబాబు అమెరికా నుంచి రావడం, తన లవర్ కి పెళ్లి, మర్డర్ ఆరోపణలు ఎదుర్కోవడం, తాత బదులు తాను వెళ్లాల్సి రావడం ఇదంతా సీరియస్ కథే అయినా కామెడిగానే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కోటలోకి వెళ్ళాక ఈరబాబు ఎదుర్కున్న సంఘటనలు ఏంటి? అక్కడ రాక్షసుడు కథేంటి? అంటూ హారర్ కామెడీగా ఫుల్ గా నవ్వించారు.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా సాగి కామెడీ అంతగా వర్కౌట్ అవ్వకపోయినా, కొంత సాగదీసినా సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ గా నవ్వించారు. ఇలాంటి సినిమాల్లో రాక్షసుడ్ని చంపడమే క్లైమాక్స్ ఉంటుంది. కానీ చివర్లో ఓ ఎమోషనల్ సీన్ అయితే ఎవరూ ఊహించరు. ఆ క్లైమాక్స్ సినిమాకు మరింత ప్లస్ అయింది. మహా భారతంలో బకాసురుడు అనే రాక్షసుడికి ఫుడ్, మనిషిని ఆహారంగా పంపాలి అని ఉంటుంది. అది బేసిక్ లైన్ తీసుకొని సస్పెన్స్ కామెడీగా ఒక ఎమోషనల్ టచ్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి చూడొచ్చు. లాజిక్స్ వెతక్కుండా హ్యాపీగా సినిమా చూస్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ సాంగ్ మంచి హిట్ అయింది కానీ సినిమా అంతా అయ్యాక ఎండ్ క్రెడిట్స్ లో ప్రమోషనల్ సాంగ్ లా వేయడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్..
సంగీత్ శోభన్ సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను హిలేరియస్ గా నవ్విస్తారు. నయన్ సారిక తన పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. రాధ్య గెస్ట్ పాత్రలో అలరించింది. రాజు పాత్రలో అనూప్ సింగ్ బాగానే నటించాడు. జబర్దస్త్ రోహిణి కూడా తన నటనతో నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి, వాసు ఇంటూరి, రోహన్ రాయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Carmeni Selvam Review : ‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ.. అప్పులు చేసే మధ్యతరగతి వాళ్ళు చూడాల్సిన సినిమా..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ సీన్స్, వర్కౌట్ అవ్వని కామెడీ కట్ చేస్తే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కోట సెటింగ్ కోసం బాగా కష్టపడ్డారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కథ సింపుల్ అయినా స్క్రీన్ ప్లే, సస్పెన్స్ కామెడీతో బాగా రాసుకొని తెరకెక్కించింది దర్శకురాలు మానస శర్మ. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘రాకాస’ ఆసక్తికరంగా సాగిన సస్పెన్స్ కామెడీ సినిమా. ఫుల్ గా నవ్వుకోడానికి వెళ్లొచ్చు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
