Biker Movie Review: ‘బైకర్’ మూవీ రివ్యూ.. బైక్ రేసింగ్ అదిరిందిగా..
బైకర్ ఒక స్పోర్ట్స్ సినిమా అనడం కంటే తండ్రి కొడుకుల ఎమోషన్ మీద తీసిన సినిమా అనొచ్చు.(Biker)
- Saketh U
- Published On : April 3, 2026 / 07:05 AM IST
Biker Review
Biker Movie Review : శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘బైకర్’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణంలో అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హీరో రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. బైకర్ సినిమా నేడు ఏప్రిల్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే..
కోయంబత్తూర్ లో ఉండే సునీల్ నారాయణ్(రాజశేఖర్) ఒక గ్రేట్ బైక్ రేసర్. తనకు సపోర్ట్ లేక సింపుల్ గా మిగిలిపోతాడు. తన కొడుకు వికాస్ నారాయణ్(శర్వానంద్)ని గొప్ప బైక్ రేసర్ గా తయారు చేస్తాడు. అతన్ని ప్రతిసారి ఓడించడానికి మరో బైకర్ ట్రై చేస్తూ ఉంటాడు. వికాస్ ని ఎలాగైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు సునీల్. దానికి స్పాన్సర్స్ కోసం తిరుగుతాడు. ఆ సమయంలో ఇంద్రనీల్ (అతుల్ కులకర్ణి) స్పాన్సర్ చేస్తాడు.
కానీ ఓ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ తర్వాత వికాస్ తనకు పెళ్లయిందని, కొడుకు పుట్టాడని తండ్రికి, ఆటకు దూరంగా వెళ్ళిపోతాడు. దాంతో సునీల్ నారాయణ్ ఏం చేస్తాడు? స్పాన్సర్ చేసిన ఇంద్రనీల్ ఏం చేస్తాడు? వికాస్ ప్రేమకథ ఏంటి? అసలు వికాస్ ఎందుకు సడెన్ గా వెళ్ళిపోతాడు? వికాస్ మళ్ళీ రేసింగ్ చేస్తాడా? ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుస్తాడా? వికాస్ కి రేసింగ్ లో ఎదురైన అడ్డంకులు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Biker Trailer : శర్వానంద్ బైకర్ ట్రైలర్.. అదిరిపోయింది..
సినిమా విశ్లేషణ..
ఇండియా ఫస్ట్ మోటో క్రాస్ ఫిలిం అంటూ బైకర్ ని ప్రమోట్ చేసారు. శర్వానంద్ ఈ సినిమా కోసం తన బాడీని మార్చుకున్న విధానం, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ తండ్రికి రేసింగ్ కి దూరంగా భార్య, కొడుకుతో ఉండే వికాస్ ని అతని ఫ్యామిలీని చూపించి, సునీల్ నారాయణ్ గురించి కొన్ని సంఘటనలు చూపించి ఫ్లాష్ బ్యాక్ లో వికాస్ ఎలాంటి రేసర్ అనేది చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ తో, కొన్ని రేసింగ్ సీన్స్ తో సింపుల్ గా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ అసలు వికాస్ ఎందుకు ఆటని వదిలేసాడు, మళ్ళీ ఎందుకు తిరిగొస్తాడు, చివరకు ఏం జరిగింది అని ఆసక్తిగా సాగుతుంది.
బైకర్ ఒక స్పోర్ట్స్ సినిమా అనడం కంటే తండ్రి కొడుకుల ఎమోషన్ మీద తీసిన సినిమా అనొచ్చు. సినిమా కథకు అవసరం లేకపోయినా కాస్త పీరియాడిక్ టైం లైన్ తీసుకున్నారు అనిపిస్తుంది. సినిమాలో బైక్ రేసింగ్ సీన్స్ చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. సినిమా మొత్తం 5 బైక్ రేసింగ్ సీన్స్ ఉంటాయి. ప్రతిదీ ఒకదానిమించి ఒకటి అదిరిపోతుంది. హాలీవుడ్ F1 రేసింగ్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ రేసింగ్ సీన్స్ చూస్తుంటే. ఈ రేసింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.
కానీ సినిమాలో ఎక్కువగా బైక్ రేసింగ్స్ ఉంటాయని ఊహించి వెళ్తే నిరాశ తప్పదు. బైక్ రేసింగ్ కంటే కూడా తండ్రి కొడుకు ఎమోషన్స్ మీదే సినిమా ఎక్కువ నడుస్తుంది. అయితే తండ్రి ఎమోషన్ ని బాగా చూపించినా కాస్త సాగదీశారు అనిపిస్తుంది. హీరోయిన్ తో లవ్ స్టోరీ కూడా సింపుల్ గానే ఉంటుంది. హీరోయిన్ తో ఉన్న ఎమోషనల్ సీన్స్, వికాస్ ఆటని ఎందుకు వదిలేసాడు అనేది ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. బేసిక్ స్టోరీ లైన్ పాతదే అయినా బైక్ రేసింగ్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. ఇండియాలో బైక్ రేసింగ్ చేసేవాళ్లకు ఇది స్పెషల్ సినిమా అవుతుంది. ఈ సినిమాలో మౌంటెన్ జంప్ సీన్ మాత్రం సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇచ్చి వావ్ అనిపిస్తుంది. ఈ సినిమా ఎమోషన్స్ చూస్తే జెర్సీ, సారపట్ట పరంబరాయ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్..
శర్వానంద్ ఈ సినిమా కోసం తన బాడీని రెండు విధాలుగా మార్చుకోవడం, బైకర్ గా విన్యాసాలు చేయడం.. వీటన్నిటికీ చాలా కష్టపడ్డాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా మెప్పించాడు. హీరో రాజశేఖర్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంచి పాత్ర పడింది. ఎమోషనల్ తో పాటు తన యాంగ్రీ యంగ్ మ్యాన్ టైటిల్ కి న్యాయం చేసారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ కి మరిన్ని పవర్ ఫుల్ పాత్రలు రావడం ఖాయం.
మాళవిక నాయర్ అందంతో మెప్పిస్తునే ఎమోషనల్ సీన్స్ లో నటనతో అలరిస్తుంది. శర్వానంద్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా క్యూట్ గా మెప్పిస్తాడు. నెగిటివ్ షేడ్స్ లో అతుల్ కులకర్ణి మెప్పిస్తారు. రెండు వేరియేషన్స్ లో మరో బైకర్ గా బాలీవుడ్ నటుడు ఇంద్రనీల్ సేన్ గుప్తా కూడా అదరగొట్టాడు. తులసి, బ్రహ్మాజీ, నవీన్ నేని.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Ramayana : ‘రామాయణ’ నుంచి రాముడు గ్లింప్స్ వచ్చేసింది..
సాంకేతిక అంశాలు..
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. రేసింగ్ సీన్స్ లో అద్భుతమైన సినిమాటిక్ విజువల్స్ తో మెప్పిస్తారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే రేసింగ్ సీన్స్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ లోను అదరగొట్టాడు సంగీత దర్శకుడు జిబ్రాన్. పాటలు మాత్రం యావరేజ్. అలాగే ఈ సినిమాకు రేసింగ్ సీన్స్ లో ఎడిటింగ్ కూడా చాలా ప్లస్ అయింది. కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.
యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. స్టోరీ రొటీన్ అయినా బైక్ రేసింగ్ సీన్స్ తో ఎమోషనల్ సీన్స్ తో చాలా ఇంటెన్స్ గా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథకు పీరియాడిక్ టైం లైన్ ఎందుకు తీసుకున్నాడో దర్శకుడికే తెలియాలి. నిర్మాణ పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘బైకర్’ సినిమా తండ్రి కొడుకుల ఎమోషనల్ ఇంటెన్స్ తో సాగిన రేసింగ్ సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
