Vivekanandan Viral : ‘వివేకానందన్ వైరల్’ మూవీ రివ్యూ.. శృంగారంలో అలా ప్రవర్తించే వాడికి ఎలా బుద్ధి చెప్పారు..?

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'వివేకానందన్ విరలను' సినిమాను తెలుగులో వివేకానందన్ వైరల్ అనే పేరుతో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.

Shine Tom Chacko Swasika Vijay Malayalam Telugu Dubbed Vivekanandan Viral Movie Review

Vivekanandan Viral Movie Review : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వివేకానందన్ విరలను’ సినిమాను తెలుగులో వివేకానందన్ వైరల్ అనే పేరుతో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం వివేకానందన్ వైరల్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో మెయిన్ లీడ్ గా శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై.. పలువురు ముఖ్య పాత్రల్లో కమల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. వివేకానందన్(షైన్ టామ్ చాకో) తన ఊరికి దూరంగా ఉండే సిటీలో వాటర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. దీంతో ఆరు రోజులు సిటీలో, వీకెండ్ రెండు రోజులు ఇంట్లో ఉంటాడు. తన తల్లి తండ్రి వేరువేరుగా ఉంటారు. ఇంట్లో భార్య(శ్వాసిక విజయ్)తో శృంగారంలో మొరటుగా ప్రవర్తిస్తూ ఆమె ఒంటిపై గాయాలు చేస్తాడు వివేకానందన్. పెళ్లయినప్పటి నుంచి ఇంతే. ఇక సిటీలో డయానా(గ్రేస్ యాంటోని) అనే అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటాడు. డయానాతో కూడా శృంగారంలో మొరటుగా ప్రవర్తించి ఆమెను గాయపరుస్తూ ఉంటాడు. మరో వైపు వేరే అమ్మాయిలను కూడా ట్రై చేస్తూ ఉంటాడు.

డయానా తన తల్లి అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు దగ్గరవుతాడు వివేకానందన్. డయానాకు ఇతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఎప్పట్నుంచో వదిలించుకోవాలనుకున్నా వివేకానందన్ వదలడు. డయానా తల్లి మరణించడంతో ఆమె ఫ్రెండ్ యూట్యూబర్ ఐషు(మెరీనా మైఖేల్)తో కలిసి వివేకానందన్ కి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. వివేకానందన్ భార్య కూడా ఇలాగే అనుభవిస్తుందని తెలిసి ఆమెతో కూడా కలుస్తుంది. మరి వివేకానందన్ భార్య, డయానా, ఐషు ముగ్గురు కలిసి వివేకానందన్ కి ఎలా బుద్ధి చెప్పారు? అతన్ని ఎలా వైరల్ చేసారు? వివేకానందన్ తల్లి తండ్రి ఎందుకు విడివిడిగా ఉంటున్నారు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : కన్నప్ప ‘శివ శివ..’ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు కష్టం..

సినిమా విశ్లేషణ.. మొదట్నుంచి కూడా సినిమాని వివేకానందన్ క్యారెక్టర్ తో అతని నేపథ్యంలోనే చూపిస్తారు. ఆ తర్వాత అతని భార్య, డయానా కష్టాలు చూపిస్తారు. సెకండ్ హాఫ్ నుంచి వివేకానందన్ భార్య, డయానా, ఐషు కలిసి ఏం చేసారు అని సాగదీశారు. ఈ సినిమా ముఖ్యంగా శృంగారంలో మొరటుగా ప్రవర్తించే మగవారిని ఉద్దేశించి తీసింది అని అర్ధమవుతుంది. ఒక మహిళ శరీరం పై తన అనుమతి లేకుండా తన భర్త కూడా చెయ్యి వెయ్యడానికి వీల్లేదు. నా శరీరం నా ఇష్టం అనే కాన్సెప్ట్ ని చివరికి చెప్పుకొచ్చారు.

మంచి కాన్సెప్ట్ అయినా సినిమాని కామెడీతో కలిపి మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించారు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు పాయింట్ వదిలేసి వివేకానందన్ చేసిన పని ప్రపంచానికి తెలియాలి అని, అప్పుడు యూట్యూబర్ చేసే హడావిడి, ఆ డైలాగ్స్, ఆ సమయంలో పోలీసులను కమెడియన్స్ గా మార్చడం, ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందర్నీ కూడా కమెడియన్స్ గా మార్చడంతో కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. సీరియస్ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు మధ్యమధ్యలో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల చాలా సినిమాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసి ఓ సమస్యని సాల్వ్ చేసినట్టు ఇందులో కూడా సింపుల్ గా వైరల్ అయిపోవడం అనేది రియాలిటీకి దూరంగా ఉంటుంది.

మధ్యలో మహిళా సంఘాలు, పురుష సంఘాలు హడావిడి అవసరం లేకపోయినా జొప్పించారు. ఇక సినిమా మొదట్నుంచి వివేకానందన్ తల్లి – తండ్రి వేరుగా ఎందుకు ఉంటున్నారో చెప్పకుండా చివర్లో వచ్చి ఈ సమస్యకు లింక్ చేయడం అస్సలు సెట్ అవ్వలేదు. వాళ్ళు విడిపోయింది ఒక కారణం అయితే దీనికి ఎందుకు లింక్ చేసారో కూడా అర్ధం కాదు. వివేకానందన్ ని ఏదో చేయాలని అనుకున్న డయానా, అతని భార్య మళ్ళీ చివర్లో సింపుల్ గా తేల్చేస్తారు. దర్శకుడు మహిళ శరీరం మీద అనుమతి లేకుండా చెయ్యి వేసే హక్కు ఎవరికీ లేదు అది భర్త అయినా సరే అనే పాయింట్ ని చెప్పాలనుకున్న చివర్లో మాత్రం దాన్ని సరిగ్గా అర్థవంతంగా చెప్పలేకపోయాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో తెలుగులో కూడా దసరా, దేవర.. లాంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఈ సినిమాలో ఓ పక్క మంచోడిగా, మరో పక్క కాస్త నెగిటివ్ షేడ్స్ లో బాగానే మెప్పించాడు. అతని భార్యగా శ్వాసిక విజయ్ చక్కగా సెట్ అయి తన నటనతో సింపుల్ భార్యగా మెప్పించింది. డయానా పాత్రలో గ్రేస్ యాంటోని కూడా బాగానే నటించింది. యూట్యూబర్ ఐషు పాత్రలో మరీనా మైఖేల్ మాత్రం ఓవరాక్షన్ అనిపిస్తుంది. వివేకానందన్ తండ్రి పాత్రలో నటించిన నటుడు కూడా మెప్పిస్తారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో బాగానే నటించారు.

Also Read : Dhanaraj : అమ్మ ఆయాగా పనిచేస్తూ.. నా మొదటి సినిమా.. మా అమ్మ చివరి సినిమా.. ఆ తర్వాత అమ్మ చనిపోయింది.. ధనరాజ్ ఎమోషనల్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ లో కేరళ అందాలు బాగానే చూపించినా నైట్ సీన్స్ లో మాత్రం లైటింగ్ ఇంకా బాగా సెట్ చేసుకోవాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదు. ఒక మంచి పాయింట్ ని కథగా తీసుకొని సింపుల్ స్క్రీన్ ప్లేతో బాగా రాసుకున్నా క్లైమాక్స్ లో తడబడ్డాడు దర్శకుడు. క్లైమాక్స్ ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘వివేకానందన్ వైరల్’ సినిమా శృంగారంలో మొరటుగా ప్రవర్తించే ఓ వ్యక్తికి అతని భార్య, ప్రియురాలు కలిసి ఎలా బుద్ధి చెప్పారు అని కామెడీ మెసేజ్ ఓరియెంటెడ్ గా చూపించారు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.