Zubeen Garg : జుబిన్ గార్గ్ కేసులో సింగపూర్ కోర్టు సంచలన తీర్పు.. ఆ కారణం వల్లే సింగర్ మృతి
Zubeen Garg : ప్రముఖ అస్సామీ సింగర్ జుబిన్ గార్గ్ కేసులో సింగపూర్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆయన మృతికి గల కారణాలు వివరించింది.
Singapore Court said Alcohol No Life Jacket for Zubeen Gargs Death
Zubeen Garg : ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ మరణంపై గత కొన్ని నెలల తరబడి కొనసాగిన అనుమానాలకు తెరదించుతూ సింగపూర్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. జుబిన్ గార్గ్ మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని కోర్టు స్పష్టం చేసింది. జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించాడని తెలిపింది. ఆయన హత్యకు గురయ్యారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్ కోర్టు స్పష్టం చేసింది. ఆయన మద్యం మత్తులో.. లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టడానికి వెళ్లడంతో నీటిలో మునిగిపోయి చనిపోయాడని కోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
2025, సెప్టెంబర్‌లో సింగపూర్‌లో నిర్వహించిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో పాల్గొనేందుకు జుబిన్ గార్గ్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన ప్రదర్శనకు ఒక రోజు ముందు అనగా.. 2025 సెప్టెంబర్ 19న ఓ బోటులో ప్రయాణిస్తుండగా ఆయన సముద్రంలో పడి మునిగిపోయారు. ఈ సంఘటన అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో జుబిన్ గార్గ్ భార్య గరిమా సైకియా గార్గ్.. తన భర్త మరణం వెనుక కుట్ర దాగి ఉందని.. పథకం ప్రకారమే తనని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. జుబిన్ గార్గ్ లాజరస్ దీవి సమీప సముద్రంలో మునిగి మరణించినట్లు తేల్చింది అని అక్కడి మీడియా నివేదికలు వెల్లడించాయి.
గరిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సింగపూర్‌కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్స్ బృందం ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేసింది. ఆ తర్వాత కోర్టుకు నివేదిక అందజేసింది. దీనిలో పలు కీలక అంశాలను వెల్లడించారు. పడవ ఎక్కే ముందే జుబిన్ గార్గ్ ఎక్కువ మోతాదులో మద్యం సేవించి.. మత్తులో జోగుతున్నట్లు విచారణలో వెల్లడైందని నివేదిక తెలిపింది. పడవ ఎక్కేటప్పుడు ఆయన లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ, మధ్యలో దానిని తీసివేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆయన అకస్మాత్తుగా నీటిలోకి జారి పడ్డారని.. ఆయనను ఎవరూ నీళ్లలోకి తోసేయలేదని నివేదిక స్పష్టం చేసింది.
స్టేట్ కరోనర్ ఆడమ్ నఖోడా కూడా జుబిన్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జుబిన్ గార్గ్ నీటిలో పడిపోవడంతో.. ఆయన ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈతగాళ్లు ఆయనను రక్షించే ప్రయత్నం చేశారే తప్ప.. హత్య చేయలేదని సింగపూర్ కోర్టు ప్రకటించింది. జుబిన్ గార్గ్ హత్య కేసులో ఎక్కడా కుట్ర కోణం కనిపించలేదని.. అందుకే ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
