“పద్మశ్రీ” అవార్డు అందుకున్న సిరివెన్నెల

  • Publish Date - March 16, 2019 / 10:10 AM IST

ఢిల్లీ :  సినిమా  పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు సినీరంగంలో  తన పాటలతో ఎందరో శ్రోతలను అలరించిన సినీ గేయరచయిత “సిరివెన్నెల” సీతారామశాస్త్రి  ఈరోజు రాష్ట్రపతి  భవన్ లో  రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా  పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.  ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించింది. 1955 మే 20న విశాఖ జిల్లా అనకాపల్లి జన్మించిన సీతారామశాస్త్రి  టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ పద్యాలు గేయాలు రచించేవారు. ఆయన రాసిన  గంగావతరణం అనే గేయాన్ని చూసిన కళాతపస్వి కె.విశ్వనాధ్ తన “సిరివెన్నెల” సినిమాలో అన్ని పాటలు సీతారామశాస్త్రితో రాయించారు.  

1986 లో వచ్చిన సిరివెన్నెల సినిమాతో  వెండితెరకు పరిచయమైన చెంబోలు సీతారామశాస్త్రి అప్పటినుంచి “సిరివెన్నెల” సీతారామశాస్త్రిగా  ఎన్నో  తెలుగు సినిమాలకు గేయరచయితగా  పాటలు అందించారు. తొలి సినిమాతోనే  నంది  అవార్డు అందుకున్న ఆయనకు, నేడు అందుకున్న పద్మశ్రీ అవార్డు ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. సీతారామ శాస్త్రికి పద్మశ్రీ అవార్డు రావడంపై పలువురు సాహితీప్రియులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీతారామ శాస్త్రికి అభినందనలు తెలిపారు.