Site icon 10TV Telugu

Sirivennela : ఈ పాట తెలుగు సినీ సాహిత్యంపై సిరివెన్నెల దిద్దిన ‘సింధూరం’

Sindhooram Song

Sindhooram Song

Sirivennela Sitaramasastri  : సిరివెన్నెల మొత్తం పాటల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాలోని “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా ” అనే పాట ఓ కలికితురాయి. ఈ పాటను దివంగత సంగీత దర్శకుడు శ్రీ స్వరపరిచారు. దివంగత దిగ్గజ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలు పాడారు. సమాజాన్ని ప్రశ్నిస్తూ… ప్రశ్నలనే బుల్లెట్లు, బల్లెంలా దింపుతూ ఈ పాటను రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివికేగిన సందర్భంగా.. ఆ పాటలోని సాహిత్యాన్ని ఓసారి చూద్దాం.

Read This : Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

చరణం 1:

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే

సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ

మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

చరణం 2:

అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా! వెలుగుని తప్పుకు తిరగాలా!

శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా! అన్నల చేతిలో చావాలా!

తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి

ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సిందూరం

వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా!

చరణం 3:

తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని

తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని

కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం

చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

Exit mobile version