నిలకడగా బాలు ఆరోగ్యం.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎంజీఎం హాస్పిటల్..

  • Publish Date - August 15, 2020 / 04:38 PM IST

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆరోగ్యం విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు వైద్యులు..



బాలు హెల్త్ కండీషన్ క్రిటికల్‌గా ఉందంటూ ఎంజీఎం హాస్పిటల్‌ వారు అధికారికంగా ప్రకటించడంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో బాలు ఆరోగ్యం గురించి ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, సోదరి వసంతలక్ష్మీ స్పందించారు.



అయితే తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ఎంజీఎం హాస్పిటల్ వారు ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యుత్తమ డాక్టర్ల పర్యవేక్షణలో బాల సుబ్రహ్మణ్యం గారికి చికిత్స అందిస్తున్నాం. నిన్నటి కంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
బాలు త్వరగా కోలుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి మ్యాస్ట్రో ఇళయరాజా వరకు చాలామంది ట్వీట్లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.



ట్రెండింగ్ వార్తలు