SP Balu Physiotherapy Video Viral: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు బాలు మృతికి నివాళులర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు వెంటిలేటర్‌పై ఉండగా వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. చేతులకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నారు బాలు. కొద్ది సేపటి తర్వాత అలసటతో ఆయన ఆపేశారు.
వైద్యులు మళ్లీ చేయించే ప్రయత్నం చేయగా బాలు చేతులు కదపలేక వద్దని వారించారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు.
ఎస్పీ బాలు అంత్యక్రియలు రేపు ఉదయం (సెప్టెంబర్ 26) 10:30 తర్వాత తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ఫామ్‌హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండడంతో అంత్యక్రియలకు కేవలం బంధువులను మాత్రమే అనుమతివ్వాలనే యోచనలో ఉన్నారు.