వేలంలో భారీ రేటు పలికిన శ్రీదేవి చీర

  • Publish Date - February 26, 2019 / 03:08 AM IST

అలనాటి అందాలతార, అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకం విడిచి వెళ్లి ఏడాది దాటిపోయింది. అయితే ఆమెను ఎప్పటికీ చిత్ర సీమ మరువదు అనడం అతిశయోక్తి కాదు. తమిళం, తెలుగు, హిందీ  సినిమాలలో అగ్రశ్రేణి నటిగా గుర్తిసంపు తెచ్చుకున్న శ్రీదేవి దేశవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నది. ఈ క్రమంలో శ్రీదేవి వాడిన చీరలను వేలం వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆమె మొదటి వర్ధంతి సంధర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా శ్రీదేవి చీరలను ఆమె కుటుంబం వేలం వేయగా భారీ రేటుకు అభిమానులు చీరను దక్కించుకున్నారు. శ్రీదేవికి చెందిన ఒక ఖరీదైన చీరకు ముందుగా రూ. 40 వేలను కనీస ధరగా ఆన్ లైన్ లో వేలంకు ఉంచగా.. ఆ చీర రూ. 1.30 లక్షల ధర పలికింది.

అయితే చీరను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాలని శ్రీదేవి కుటుంబసభ్యులు భావించారు. దేవి భర్త బోనీకపూర్‌ కన్‌సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు ఈ డబ్బును అందించనున్నట్లు చెబుతున్నారు. ఆ డబ్బుతో ఆసరా లేని మహిళలు, అనాథ బాలలు, వృద్ధుల సంక్షేమానికి ఆ సంస్థ వినియోగించనుంది. అతిలోకసుందరి ఈ భూమి మీద లేకున్నా కూడా ఆమె చీర కూడా సామాజిక కార్యక్రమానికి ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి ఫిబ్రవరి 24వ తేదీ 2018లో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే.