కరోనాతో ‘స్టార్‌ వార్స్’ నటుడు మృతి – సింగర్‌కు పాజిటివ్..

కరోనా ఎఫెక్ట్ : స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మరణం.. సింగర్ కేలీ షోర్‌కు పాజిటివ్..

  • Publish Date - April 1, 2020 / 05:39 PM IST

కరోనా ఎఫెక్ట్ : స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మరణం.. సింగర్ కేలీ షోర్‌కు పాజిటివ్..

కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నా ఏదోలా విశ్వరూపం చూపిస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ నటుడు, ‘స్టార్‌ వార్స్‌’ ఫేమ్‌ ఆండ్రూ జాక్‌ కరోనా వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావటంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. జాక్‌ ‘స్టార్‌ వార్స్‌’ ఎపిసోడ్‌ 7,8 లలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు డయలెక్ట్‌ కోచ్‌( భాషకు సంబంధించిన మెలుకువలు నేర్పేవారు)గా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన.

ఆస్ట్రేలియాలో ఉన్న జాక్‌ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆయన మృతిపై స్పందిస్తూ.. ‘‘ రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశార’ని పేర్కొన్నారు. కాగా అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌(25) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ మేరకు.. ‘‘మూడు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాను. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాను. అయినా కరోనా సోకింది. అప్పటి నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నా. ఒళ్లు నొప్పులు, జ్వరం, రుచి తెలియడం లేదు, ముక్కు కూడా పని చేయడం లేదు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం నాకు విసుగ్గా అనిపిస్తోంది’’ అని కేలీ షోర్ ట్వీట్‌ చేశారు. కరోనా బారినపడి జాక్ మరణించడం, కేలీకు పాజిటివ్ రావడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది.