ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమా షూటింగ్‌లను శర వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఓజీ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్టు పూరైంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పవన్‌తో దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. “మాటిస్తే.. నిలబెట్టుకోడం, మాట మీదే.. నిలబడ్డం, మీరు పక్కనుంటే..కరెంటు పాకినట్టే.” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
హరీశ్ పోస్టు చేసిన ఫోటోలో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో రాశిఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.